Dharmaram | ధర్మారం, మే 18: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో అస్వస్థకు గురై మరణించిన గొర్రెల సంఖ్య 96 కు చేరింది. గత రెండు రోజుల నుంచి గొర్రెలు అస్వస్థకు గురై మరణిస్తున్నాయి. శనివారం 50 గొర్రెలు మరణించగా తాజాగా ఆదివారం మరో 46 మరణించాయని గొర్రెల పెంపకం దారులు తెలిపారు. వివరాల్లోకి వెలితే… ఐదుగురు గొర్రెల పెంపకం దారులు సంయుక్తంగా 500 గొర్రెలను పెంచుతూ ఉపాధి పొందుతున్నారు. రోజు మాదిరిగానే గ్రామ శివారులలో కోసిన వరి పొలాలలో వారంతా కలిసి గొర్రెలను మేత మేపుతున్నారు.
ఈ క్రమంలో మేతమేసి సాయంత్రం సమయంలో మందకు వచ్చిన తర్వాత అస్వస్థకు గురైన 50 గొర్రెలు శనివారం మరణించాయి. అప్పటికే మరికొన్ని గొర్రెలు కూడా అస్వస్థకు గురై మందలోనే ఉన్నాయి. అస్వస్థకు గురైన గొర్రెలు కూడా మరణిస్తాయని ఆందోళనలో పెంపకం దారులు ఉన్నారు. దీంతో తాజాగా ఆదివారం మరో 46 గొర్రెలు మరణించినట్లు గొర్రెల పెంపకం దారులు తెలిపారు. గొర్రెల పెంపకం దారులు కొమ్ము రాజేశం వి 22, రేషవేణి మల్లేశం 18, కొమ్ము కనకయ్యవి 18, సమ్మెట కొమురయ్యవి 19, దాడి నాగయ్యవి 18 తో పాటు మరో పెంపకం దారుడుది ఒక గొర్రె చొప్పున మరణించాయి.
ఇందులో 88 ఆడ గొర్రెలు,8 గొర్రెపోతులు ఉన్నాయి. మూగజీవాల మరణంతో సుమారు రూ.15 లక్షలు విలువైన నష్టం జరిగిందని గొర్రెల పెంపకం దారులు తెలిపారు. పెద్దపల్లి పశుసంవర్థక శాఖ అధికారి శంకర్ ఆధ్వర్యంలో ధర్మారం, పత్తిపాక, జూలపల్లి వెటర్నరీ డాక్టర్లు అజయ్, అనిల్, అజారుద్దీన్ మిగతా గొర్రెలకు చికిత్స అందించి మందులు పంపిణీ చేశారు. మూగ జీవాల మృత్యువాతకు గల కారణాలు తెలుసుకోవడానికి డాక్టర్లు మూడు గొర్రెలను అక్కడే పోస్టుమార్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శ
రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గ్రామానికి వెళ్లి మృత్యువాత పడిన గొర్రెల కళేబరాలను పరిశీలించి బాధిత గొర్రెల పెంపకం దారులతో మాట్లాడారు. మరణించిన గొర్రెలకు పరిహారం గురించి జిల్లా కలెక్టర్ తో ఆయన ఫోన్ లో మాట్లాడారు. మూగజీవాల మరణంతో తాము ఉపాధి కోల్పోయి తీవ్ర నష్టం వాటిల్లిందని తమను ఆదుకోవాలని పెంపకం దారులు ఆయనను కోరారు. సాధ్యమైనంతవరకు ప్రభుత్వం ద్వారా పరిహారం ఇప్పించడానికి తనవంతు కృషి చేస్తానని పెంపకం దారులకు లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.
లక్ష్మణ్ కుమార్ వెంట ఏఎంసీ చైర్మన్ లావుడియా రూప్ల నాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, డైరెక్టర్ జనగామ తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మేకల మల్లేశం, యాదవ ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు మారం తిరుపతి, నాయకులు సంధినేని కొమరయ్య, వేల్పుల నాగరాజు, జంగ మహేందర్ తదితరులు గ్రామాన్ని సందర్శించి పెంపకం దారులను పరామర్శించారు.
పెంపకం దారులకు బీఆర్ఎస్ నాయకుల పరామర్శ
బొమ్మ రెడ్డి పల్లి గ్రామంలో గొర్రెలు మృతి వార్త పడడంతో ఆదివారం ఆ గ్రామానికి వెళ్లి బాధిత గొర్రెల పెంపకం దారులను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. మూగజీవాల మృత్యువాత గల కారణాలను వారు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత గొర్రెల పెంపకం దారులకు తగిన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు గాగిరెడ్డి వేణు గోపాల్ రెడ్డి, దాడి సదయ్య, మాజీ ఉప సర్పంచ్ లు ఆవుల లత, బత్తిని తిరుపతి, గొర్ల కాపరుల సొసైటీ అధ్యక్షుడు రాధారపు లింగయ్య,పుట్ట కొమురయ్య, సంకరి నర్సింగం, రాధారపు బుచయ్య,గాజంగి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.