పెద్దపల్లి రూరల్, జూలై 06: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొంతకాలానికే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేసింది. ఈ క్రమంలో నాటి సీఎం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమనేత కేసీఆర్ సొంత నిర్ణయంతో స్థానిక నేతలు, గతంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న స్మితా సబర్వాల్‌తో జరిపిన సమాలోచనలతో ఏర్పడిన పెద్దపల్లి జిల్లాకు పక్కా భవనాల నిర్మాణాలను దశల వారీగా చెపట్టడం కోసం చేసిన ప్రణాళికలు మెల్లమెల్లగా కదులుతున్నాయి. ఇందులో భాగమే జిల్లా కోర్టు భవనాల సముదాయం. జిల్లా కోర్టు భవనాల సముదాయం నిర్మించేందుకు అనువైన స్థలం దొరకక అధికారులు అనేక రకాల మల్లాగుల్లాలు పడ్డారు. పెద్దపల్లి మండలంలోని రంగంపల్లి, అందుగులపల్లి గ్రామాల్లో గతంలో స్థలాలను ఎంపిక చేసినప్పటికీ అధికారులు, న్యాయవాదుల మధ్య సమన్వయం లోపంతో ఎక్కడా స్థల నిర్ణయం కాకపోవడంతో జిల్లా కోర్టు భవనాల సముదాయ నిర్మాణానికి నిర్ణయం జరుగలేదు. ఈ క్రమంలో అధికారుల కన్ను పెద్దపల్లి మండలం రాఘవాపూర్ శివారులో 2004లో అప్పటి ప్రభుత్వం గొల్ల కుర్మల గొర్రెల మందల కోసం యాదవ సంఘానికి 5 ఎకరాలు, కుర్మ సంఘానికి 5 ఎకరాల చొప్పున కేటాయించిన సర్వేనంబర్ 1072 భూమిపై పడింది. ఇంకేముంది ఆలోచన వచ్చిందే ఆలస్యం అన్నట్లు ఆ పదెకరాల స్థలం కోర్టు భవనాల సముదాయానికి అనువైనదిగా అందరూ నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి, పై కోర్టులకు నివేదికలు పంపించారు.
ఆ భూమి పెద్దపల్లి- మంథని ప్రధాన మార్గంలో జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం, భూమి కూడా ఇప్పటికిప్పుడే భవనాలు నిర్మించుకునేందుకు అనువుగా ఉండడంతో గ్రీన్ సిగ్నల్ రావడమే కాదు గదా వెంటనే తమకు కేటాయించాలనుకున్న భూమిని వెంటనే సర్వే చేసి అప్పగించాలని కోర్టు విభాగాల తరపునసీనియర్ సివిల్ జడ్జి, అసిస్టెంట్ సెషన్స్ జడ్జి బీ. శ్రీనివాసులు పెద్దపల్లి తహసీల్దార్‌కు లేక రాశారు. దీంతో పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఆర్ఐ భాను కుమార్, సర్వేయర్ గణపతి గ్రామానికి చేరుకుని గొల్లకుర్మల కోసం కేటాయించిన పదెకరాల భూమిని సర్వే చేసేందుకు ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన గొల్లకుర్మలు, గొర్రెల కాపరులు అక్కడికి చేరుకుని ప్రభత్వం తమకు ఇచ్చిన భూమిని తీసుకుంటే మా గతేంటని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. దీంతో గొర్రెల మందల కోసం రాఘవాపూర్- గౌరెడ్డిపేట మార్గంలో పదెకరాలు భూమికి బదులు భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. దానికి వారు ఒప్పుకోవడంతో పెద్దపల్లి జిల్లా కోర్టు భవనాల సముదాయానికి మార్గం సుగమమైంది. మరోవైపు గొల్లకుర్మల సంఘాలకు భూముల కొరత సమస్య లేకుండా సమస్య పరిష్కారైంది.
సమన్వయంతో సమస్యకు పరిష్కారం..
పెద్దపల్లి జిల్లా కోర్టు భవనాల సముదాయ నిర్మాణానికి చాలా కాలంగా స్థలాభావం సమస్య ఉన్నదని తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ అన్నారు. ఇటీవల తాను ఉద్యోగ బదిలీపై పెద్దపల్లి రావడంతోనే జిల్లా కోర్టు భవనాల సముదాయ నిర్మాణానికి అనువైన స్థలం కోసం అన్వేషణ చేశాం. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఇతర పెద్దలు, ప్రజా ప్రతినిధులు, నాయకుల, న్యాయవాదుల సహకారంతో కోర్టు భవనాల సముదాయ నిర్మాణానికి మార్గం సుగమం చేసే ప్రక్రియను ప్రారంభించి సుఖాంతం చేయగలిగాం. పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్‌లోని సర్వే నంబర్ 1072లో గొల్లకుర్మలకు గతంలో కెటాయించిన భూమిని వారి సమ్మతితోనే జిల్లా కోర్టుకు కేటాయిస్తూ, అదే గొల్లకుర్మలకు అదే సర్వే నంబర్ 1072లో కోర్టుకు ఇచ్చిన 10 ఎకరాలకు బదులు 10 ఎకరాలు గొర్రెల మందలకు ఇచ్చేలా స్థానిక మాజీ సర్పంచ్ ఆడె వెంకటేశం సమక్షంలో చర్చించి ఇరువురి ఒప్పందం ప్రకారమే సమస్యకు పరిష్కారం చూపామన్నారు.