పెద్దపల్లి, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను పెద్దపల్లి జిల్లాలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కలిగించడమే తమ లక్ష్యమని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రతి ఓటరునూ గుర్తిస్తామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తామని స్పష్టం చేశారు. అనర్హులను మాత్రమే తొలగిస్తామని, ఎలాంటి ఆందోళన వద్దని సూచించారు.
సిబ్బందికి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఫారాలను ఫిల్ చేయడంలో అనుమానాలను నివృత్తి చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ మేరకు మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లా పరిధిలో 7,12,157 మంది ఓటర్లు ఉన్నారని, సుక్షితులైన 844మంది బీఎల్వోలతో సర్ నిర్వహిస్తున్నామన్నారు. బీఎల్వోలతోపాటు అన్ని పార్టీల ప్రతినిధులు సహకారంతో విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు.
నమస్తే తెలంగాణ : జిల్లాలో సర్ ఎలా నడుస్తున్నది?
కలెక్టర్ : ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా సర్ నడుస్తున్నది. పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలకు సంబంధించి 18 మండలాలు, రామగుండం కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లు, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో విజయవంతంగా కొనసాగుతున్నది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాల్లోని పలు మండలాల పర్యవేక్షణ సైతం పెద్దపల్లి నుంచే కొనసాగుతున్నది. గత నెల 15 నుంచి 24 వరకు ప్రిపరేషన్, ట్రైనింగ్ అండ్ ప్రింటింగ్, హౌస్ మ్యాపింగ్ పూర్తి చేసి, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని ప్రారంభించాం. 25వ తేదీ నుంచి ఫారాల సేకరణను కూడా మొదలుపెట్టాం. ఫారాలను ఫిల్ చేయడంలో ఓటర్ల అనుమానాలను వాటన్నింటినీ నివృత్తి చేస్తున్నాం.
ఈ నెల 24 వరకు ఎన్యుమరేషన్ ఫారాలను సేకరిస్తాం. ఆ తర్వాతే పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, ఫిర్యాదులు, అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరిస్తాం. సందేహాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తాం. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన విధంగా అక్టోబర్ ఒకటికల్లా తుది జాబితాను ప్రకటిస్తాం. ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వో పర్యవేక్షకులు, బీఎల్వోలు పనిచేస్తున్నారు.
నమస్తే : బీఎల్వోలు ఒకే చోట కూర్చుని ఫారాలను పంపిణీ చేస్తున్నారు కదా..?
కలెక్టర్ : ఒకే చోట కూర్చొని ఫారాలను పంపిణీ చేసేసినా.. బీఎల్వో తప్పకుండా ప్రతి ఇంటికి రెండు సార్లయినా వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడైనా బీఎల్వో ఇంటికి రాకుంటే సదరు బీఎల్వో ఫోన్ నంబర్‌ను తెలుసుకొని సంప్రదించవచ్చు. ఏదేమైనా అర్హులైన ప్రతి ఓటరు ఓటు నమోదుకు పూర్తి స్థాయి అవకాశం ఉన్నది.
నమస్తే: రాజకీయ పార్టీల సహకారం ఎలా ఉన్నది?
కలెక్టర్ : సర్ కార్యక్రమం విజయవంతం అవుతున్నదంటే మా సిబ్బంది పనితీరు ఎంత ముఖ్యమో.. రాజకీయ పార్టీ ప్రతినిధుల సహకారం కూడా అంతే ముఖ్యం. వారి సహకారంతోనే విజయవంతంగా ముందుకు సాగుతున్నాం. గతంలో కొన్ని రాష్ర్టాల్లో సర్ నిర్వహించిన తర్వాత ఎన్నికలు జరగడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినట్టు గుర్తించాం. కానీ, మన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం లేదు. అలాంటి ఇబ్బందులు మన తెలంగాణలో, మన పెద్దపల్లి జిల్లాల్లో వచ్చే చాన్స్ లేదు.
నమస్తే: సర్ ఫారాలు, డిజిటలైజేషన్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది?
కలెక్టర్ : జిల్లాలో 7,12,157 మంది ఓటర్లకు సంబంధించి సర్‌ను నిర్వహిస్తున్నాం. ఫారాల పంపిణీకి సంబంధించి 844మంది బీఎల్వోలకు ఒక్కొక్కరికి 844మంది ఓటర్ల చొప్పున కేటాయించాం. అందులో ఒక్కో బీఎల్వో దాదాపుగా 818 వరకు ఫారాల పంపిణీ పూర్తి చేశారు. 1,01,369 మందికి సంబంధించి ఈ రోజు వరకు 14.23 శాతం పూర్తి డిజిటలైజ్ పూర్తయింది. ఇంకా 6,09,093 మందికి సంబంధించి 85.53 శాతం పూర్తి చేయాల్సి ఉన్నది. జిల్లాలో 2,378 మందికి సంబంధించి మ్యాపింగ్ కూడా చేయాల్సి ఉన్నది.
ప్రధానంగా ఎలాంటి సమస్యలు వస్తున్నాయి?
కలెక్టర్: ఎన్యుమరేషన్ ఫారాలను నింపే విషయంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు చాలా సమయం పడుతున్నది. 2002 సర్‌కు అనుగుణంగా వివరాలను నింపాల్సి వస్తుండడంతో ఆ వివరాలను ఆన్లైన్ (ఈసీ వెబ్సైట్) నుంచి తీసుకోవడంలో చాలా వరకు గ్రామాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. అందులో కొంత మంది వేరే నియోజకవర్గాల్లో.. వేరే జిల్లాల్లో.. వేరే రాష్ర్టాల్లో ఉన్నారు. పెళ్లిళ్లు అయిన వారికి సంబంధించిన సమస్యలను గుర్తించాం. ఉద్యోగ రీత్యా వెళ్లిన వారి అంశాలు ముందుకు వచ్చాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఒకరికి ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి. రెండు ప్రాంతాల్లో ఓటు నమోదు చేయడం చట్టవిరుద్ధం. ఓటు ఉండి చిరునామా మారితే ఫారం-8 ద్వారా అడ్రస్ మార్చుకోవాలి.
ఓటు కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
కలెక్టర్: సర్‌లో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కలిగించడమే మా లక్ష్యం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభిస్తుంది. అయితే ఎన్నికల కమిషన్ సూచించిన మేరకు సదరు పత్రాలను రుజువుగా సమర్పించాలి. సమర్పించిన పత్రాలు ఆమోదయోగ్యమైనవే అయితే వారికి ఓటు హక్కు వస్తుంది.
ఓట్లు తగ్గే అవకాశం ఉన్నదా?
కలెక్టర్: అయితే.. ఇక్కడ కొంత మంది ఓటర్లు రెండు చోట్ల ఓటు హక్కును కలిగి ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. మూడు నియోజకవర్గాల్లో దాదాపుగా 40వేల ఓట్ల వరకు తొలగించే అవకాశమున్నది. అందులో రామగుండం నియోజకవర్గంలో కొంత ఎక్కువగానే ఉండొచ్చు. ఎక్కువగా డబుల్ ఓట్లు ఉన్న వారే ఉన్నారు.