Panchayat elections | పెద్దపల్లి, డిసెంబర్ 3 : గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ర్ట ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని జిల్లా అధికారులకు సూచించారు. పంచాయతీ ఎన్నికల నిర్వాహనపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం కలెక్టర్లతో ఆమె సమీక్షించారు. పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఎన్నికల సాధారణ పరిశీలకుడు నరసింహారెడ్డి, డీసీపీ రాం రెడ్డి, జడ్పీ సీఈవో నరేందర్, డీపీవో వీర బుచ్చయ్య, సంబంధిత అధికారులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి రెండు విడుతలలో ఎక్కడ కూడా సింగిల్ నామినేషన్ మాత్రమే దాఖలైన స్థానాలు లేవని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు అవసరమైన మేర అందుబాటులో ఉన్నాయన్నారు. 6న పోలింగ్ సిబ్బంది శిక్షణ, పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.
రామగుండం సీపీ కమిషనర్ అంబర్ కిషోర్ మాట్లాడుతూ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనట్లు తెలిపారు. జిల్లాలో 4 అంతర్ జిల్లాల చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.