Without Penalty | కోల్ సిటీ, మే 24 : ప్రస్తుత ఆర్థిక సoవత్సరానికి ( 2025-26 ) సంబందించిన ఆస్తి పన్ను పెనాల్టీ లేకుండా చెల్లించడానికి జూన్ 30, 2025 వరకు మాత్రమే గడువు ఉన్నందున పన్నుచెల్లింపుదారులు త్వరపడాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు), కమిషనర్ (ఎఫ్ఎసీ) అరుణ శ్రీ కోరారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఇంటింటికీ ఆస్తి పన్నుల డిమాండ్ నోటీసుల పంపిణీ ప్రక్రియ మరో మూడు రోజుల్లో ముగియనుందని అన్నారు.
డిమాండ్ నోటీస్ రాకున్నప్పటికీ ఆన్ లైన్ లో లేదా నగర పాలక సంస్థ కార్యాలయ కౌంటర్, ప్రభుత్వ మీ సేవా కేంద్రాలు, ఇంటి ముందుకు వచ్చే వార్డు అధికారుల వద్ద పన్ను చెల్లించవచ్చని తెలిపారు. జూన్ 30, 2025 తర్వాత ప్రతీనెలా ఆస్తి పన్ను మొత్తం పై రెండు శాతం పెనాల్టీ విధించడం జరుగుతుందని తెలిపారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ , ప్రభుత్వేతర ఆస్తులు 51,014 ఉండగా 15, 176 ఆస్తులకు సంబంధించి పన్ను ఇప్పటివరకు చెల్లించారని తెలిపారు. మిగిలిన 35, 838 పన్ను చెల్లింపుదారులు కూడా వెంటనే ఆస్తి పన్నులు చెల్లించి నగరాభివృద్దికి సహకరించాలని కోరారు.