విశాలమైన తరగతి గదులు, మైదానాలు, గ్రంథాలయాలు, అనుభవజ్ఞులైన లెక్చరర్లతో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగి, వేలాది మందికి విద్యనందించి, ఉత్తీర్ణతలో ఉన్నతంగా నిలినిన ఈ కళాశాలలు కాంగ్రెస్ పాలనలో వెనుకబడిపోతున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల రిజల్ట్‌తో పోటీ పడలేక చతికిలపడిపోతున్నాయి. అందుకు ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. లెక్చరర్ల మధ్య ఆధిపత్య పోరు వల్లే ఈ దుస్థితి వచ్చిందని విద్యావేత్తలు అంటుండగా, ఇక ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలు ప్రశ్నార్థకమే అంటున్న నిపుణులు పేర్కొంటున్నారు.
జగిత్యాల, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టారు. కోట్లాది రూపాయల నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణంతోపాటు మౌలిక వసతులు కల్పించారు. ప్రయోగశాలలను ఆధునీకరించారు. బీర్పూర్, ధర్మారం, సారంగాపూర్, కొడిమ్యాల వంటి మారుమూల ప్రాంతాల్లో కాలేజీల భవనాల నిర్మాణాలు పూర్తి చేశారు.
సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులు సైతం కనీస ఫీజును చెల్లించాల్సి ఉండగా, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి ఉచితంగా మార్చివేశారు. దీనికి తోడు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, క్రీడా సామగ్రి అందజేశారు. ఈ సౌకర్యాలతో పాటు, జూనియర్ కాలేజీల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించారు. దీంతో అన్ని జూనియర్ కాలేజీలు పూర్తిస్థాయి బోధన సిబ్బంది అందుబాటులోకి వచ్చి నాణ్యమైన విద్య అందింది.
పడిపోతున్న ఫలితాలు
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరాలని ఎంతగా ప్రచారం చేస్తున్నా, ప్రయత్నం చేస్తున్నా విద్యార్థులను ఆకర్షించలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం రెండు విద్యా సంవత్సరాలుగా వస్తున్న ఫలితాలే అని చెప్పక తప్పదు. దశాబ్దకాలంగా 70 శాతానికి పైగా ఫలితాలతో దూసుకుపోయిన జగిత్యాల జిల్లా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, వరుసగా రెండేళ్లుగా అందుకు విరుద్ధమైన ఫలితాలను నమోదు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఈ నెల 22న విడుదలైన ఫలితాలు నేలచూపు చూశాయి.
చాలా కాలేజీలు మెరుగైన ఫలితాలు సాధించలేకపోయాయి. జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి ఇంటర్ ఫస్టియర్ (జనరల్)లో 2,304 మంది పరీక్షలు రాయగా, కేవలం 1006 మంది (43.66శాతం ) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. జనరల్ విభాగంలో 1758 మంది హాజరు కాగా, అందులో 752 మంది (42.77 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విభాగంలో 546 మంది పరీక్ష రాయగా, 254 మంది (46.52 శాతం) ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా జిల్లా సగటు (ప్రైవేట్, రెసిడెన్షియల్ కాలేజీల సంఖ్యను కలుపుకొని) 51.44 శాతం కాగా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల ఫస్టియర్ ఫలితాలు కేవలం 43.66 శాతమే వచ్చాయి.
ఇక సీనియర్ ఇంటర్ ఫలితాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. జిల్లా సగటు ఫలితాలు 67.30 శాతంగా నమోదయ్యాయి. అయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మాత్రం జిల్లా సగటు కంటే తక్కువగా నమోదు చేశాయి. సెకండియర్‌లో జనరల్ కేటగిరిలో 1,812 మంది హాజరుకాగా, 1052 మంది (58.02 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విభాగంలో 527 మందికి 368 మంది (69.82 శాతం) ఉత్తీర్ణత సాధించారు. జనరల్, ఒకేషనల్ కలిసి జిల్లా ప్రభు త్వ కాలేజీల సగటు 60.70 శాతంగా నమోదైంది. ఇది జిల్లా సగటు కంటే 7.30 శాతం తక్కువగా ఉండడం గమనార్హం.
మేమేం చేయగలం?
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫలితాలు తక్కువగా నమోదు కావడంతో ఇంటర్ బోర్డు జిల్లా అధికారులు గత బుధవారమే సమీక్షించారు. ముఖ్యంగా జగిత్యాల బాలుర కాలేజీ, మల్లాపూర్, రాయికల్, కథలాపూర్, గొల్లపల్లి, ధర్మపురి కాలేజీల్లో అతి తక్కువగా ఫలితాలు ఎందుకు వచ్చాయని చర్చించినట్లు తెలుస్తున్నది. 80 శాతం ఫలితాల కంటే తక్కువ సాధించిన లెక్చరర్లను సమీక్షకు హాజరు కావాలని ఆదేశించగా, చాలా తక్కువ మంది హాజరైనట్లు సమాచారం. సమీక్షలో తక్కువగా ఫలితాలు ఎందుకు నమోదయ్యాయని విచారిస్తే, లెక్చరర్లు చెప్పిన కారణాలు విని ఉన్నతాధికారులు బిత్తరపోయినట్లు తెలుస్తున్నది.
తమ కాలేజీ పట్టణానికి దాదాపు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉందని, పిల్లలు రావడం లేదని, అందుకే ఫలితాలు రాలేదని ఒక కాలేజీ లెక్చరర్లు చెబితే, మరో కాలేజీ లెక్చరర్ విద్యార్థులు కాలేజీకి రావడం లేదని, ఎందుకు అని ప్రశ్నిస్తే ఆత్మహత్య చేసుకుటామని బెదిరిస్తున్నారని. అందుకే తాము ఏం చేయలేకపోతున్నామని, ఇది ఫలితాలపై ప్రభావం చూపిందని చెప్పినట్టు తెలుస్తున్నది. మరి కొందరు లెక్చరర్లు, ప్రభుత్వ కాలేజీలకు వచ్చే విద్యార్థుల్లో పస ఉండడం లేదని, క్రీమ్ స్టూడెంట్స్ అంతా ప్రైవేట్ కాలేజీలకు పోతున్నారని, స్క్రాప్ లాంటి విద్యార్థులతో ఈ పాటి ఫలితాలు సాధించడమే గొప్ప అంటూ వ్యాఖ్యానించడంతో ఉన్నతాధికారులు బిత్తరపోయినట్లు తెలుస్తున్నది.
లెక్చరర్ల అంతర్గత సమస్యలే కారణమా..?
జూనియర్ కాలేజీల్లో ఫలితాలు సరిగా నమోదు కాకపోవడానికి, లెక్చరర్ల మధ్య ఉన్న అంతర్గత సమస్యలు, ఆధిపత్య పోరే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లెక్చరర్లు ఇంటర్ బోర్డు నిర్దేశించిన డ్యూటీలను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని, అంకిత భావంతో పనిచేయడం లేదన్న విమర్శలున్నాయి. పిల్లల ఉత్తీర్ణత కోసం ఇంటర్‌బోర్డు 90 రోజుల ప్రణాళికను నిర్దేశించారు. అయితే చాలా మంది లెక్చరర్లు ఈ ప్రణాళికను కేవలం టీచింగ్ డైరీలో రాసి క్షేత్రస్థాయిలో అమలు చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక లెక్చరర్ల విషయాల్లో ఏర్పడ్డ మూడు సంఘాలు మధ్య అంతర్గత ఆధిపత్య పోరాటం సాగుతున్నట్టు తెలుస్తున్నది.
ఇంటర్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంపై దృష్టి పెట్టకుండా, ప్రాక్టికల్, థియరీ పరీక్షల్లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, స్కాడ్, సిట్టింగ్ స్కాడ్ డ్యూటీల కోసం సిగపట్లు పట్టినట్టు తెలుస్తున్నది. సీనియర్లు, జూనియర్లు, ఎక్కువ డ్యూటీలు, తక్కువ డ్యూటీలు, అంటూ దాదాపు రెండు నెలల కాలం వాటిపైనే దృష్టి సారించారని, తమను పట్టించుకోలేదని విద్యార్థులే చెబుతున్నారు. జిల్లాలో అతి తక్కువ ఫలితాలను నమోదు చేసిన ఒక జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థులు మాట్లాడుతూ ‘మా లెక్చరర్లు ఎప్పుడు సరిగా పాఠాలు చెప్ప లేదు. జనవరి నుంచే ఎగ్జామ్ డ్యూటీలు అంటూ తిరిగారు. మాకు సబ్జెక్టే అర్థం కాలేదు. ఇగ పాస్ ఎట్ల అయితం’అంటూ వాపోయారు.
తలలు పట్టుకుంటున్న అధికారులు
ప్రభుత్వ కాలేజీల్లో అతి తక్కువ ఫలితాలు నమోదు కావడంతో ఇంటర్ బోర్డు అధికారులు తలలు పట్టుకుంటున్నా రు. ప్రిన్సిపాల్స్‌ను బాధ్యులను చేస్తూ వివరణ కోరినట్లు తెలుస్తున్నది. మెరుగైన ఫలితాలు వచ్చినప్పుడే పిల్లల అడ్మిషన్ల కోసం ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు ఫలితాలు తగ్గడంతో ప్రవేశాలు ఎలా వస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనైనా మెరుగైన ఫలితాలను సాధించేందుకు ప్రయత్నించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
70 మందిలో ఒక్కరే పాస్
అది రాయికల్ మండల కేంద్రంలోని ఘనమైన చరిత్ర కలిగిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ. నాలుగున్న దశాబ్దాల క్రితమే ఏర్పాటైన కళాశాలలో చదివిన వేలాది మంది విద్యార్థులు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈ యేడాది ఇంటర్ ఫస్టియర్ జనరల్ కేటగిరీ విభాగంలో పరీక్షలకు 70 మంది హాజరుకాగా, ఉత్తీర్ణత సాధించింది కేవలం ఒక్క విద్యార్థే. సెకండియర్‌లో 66 మంది హాజరైతే, పాస్ అయ్యింది ఐదుగురే. అలాగే మల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీది మరో కథ. 110 మంది విద్యార్థులు ఫస్టియర్ పరీక్షలు రాస్తే పాసైంది కేవలం నలుగురే. సెకండియర్ నుంచి పరీక్షలు రాసింది 92 మందైతే గట్టెక్కింది 19 మంది మాత్రమే. కనీస ఫలితాలు సైతం నమోదు చేయలేని దుస్థితిలోకి వెళ్లిపోవడాన్ని చూస్తే, జూనియర్ కాలేజీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అడ్వాన్స్డ్ సప్లీలో మంచి ఫలితాలు సాధిస్తాం
ఇంటర్ ఫలితాలు గతంతో పోలిస్తే నాలుగైదు శాతం పెరిగాయి. అయితే అనుకున్న స్థాయిలో రాలేదు. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల రిజల్ట్ బాధపెట్టింది. దీనిపై లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష చేసుకుంటున్నాం. ఎక్కడ ఇబ్బంది వచ్చిందో గుర్తిస్తాం. లెక్చరర్ల వద్ద నుంచి, ప్రిన్సిపాళ్ల వద్ద నుంచి వివరణ తీసుకుంటున్నాం. అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తాం. – బొప్పరాతి నారాయణ, ఇంటర్‌బోర్డు అధికారి (జగిత్యాల)