ఓదెల, ఏప్రిల్ 27: కొలనూర్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కేందుకు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాదారణంగా గూడ్స్ రైళ్లకు 50కిపైగా బోగీలు ఉండగా, అందుకనుగుణంగా స్టేషన్లలో ప్లాట్ ఫాంలను పొడిగించారు. అయితే ప్యాసింజర్ రైళ్లకు 14బోగీలే ఉండడం వల్ల ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. ప్లాట్ ఫాంలు పొడవుగా ఉండడం, రైలు బోగీలు తక్కువగా ఉండడం వంటి కారణంగా రైళ్లు స్టేషన్న్లలో సిగ్నల్ ఉండే వరకు వెళ్లి ఆగుతుండడంతో.. చివరి బోగీని అందుకోవడం కోసం పరుగెత్తుతున్నారు.
మహిళలు చంటి పిల్లలను ఎత్తుకొని, లగేజీతో పరుగెత్తలేకపోతున్నారు. అలాగే వృద్ధులు కూడా పరుగెత్తలేక మిస్ అవుతున్నారు. సోమవారం కొలనూర్ స్టేషన్లో చాలా మంది ఇంటర్ సిటీ రైలు (17012) ఎక్కలేకపోయారు. అయితే డ్రైవర్, గార్డు ఇద్దరు సమన్వయంతో స్టేషన్ మధ్యలో రైలు ఆపితే ప్రయాణికులు ఎక్కడానికి సౌకర్యంగా ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ విషయంలో రైల్వే శాఖ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.