Parking charges | ధర్మపురి, జూన్23: ధర్మపురి క్షేత్రానికి వచ్చే భక్తుల వాహనాల అనుమతి మరియు పార్కింగ్ కోసం శ్రీలక్ష్మీనరసింహ పార్కింగ్ సర్వీసెస్ పేరిట ఇష్టా రాజ్యం గా వసూళ్లు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్లు అధికారులకు తెలిసినప్పటికీ చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఏడాది మార్చి 27న ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో అధికారులు వాహనాల పార్కింగ్ కోసం బహిరంవేలం పాట నిర్వహించారు. ఇందులో ధర్మపురికి చెందిన ఓ వ్యక్తి రూ.52లక్షల55వేలకు పార్కింగ్ వేలాన్ని దక్కించుకున్నారు.
అయితే నిబందనల ప్రకారం.. బస్సు/లారీ/ఐచర్ వ్యాస్‌కు రూ.100, కారు, జీబుకు రూ.50, అటో పార్కింగ్‌కు రూ.30లు మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. కానీ గత 15 రోజులుగా రూ.10అదనంగా వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా కారు పార్కింగ్ కోసం రూ.60, అటో పార్కింగ్ కోసం రూ.40వసూలు చేస్తున్నారు. ఇదేమిటని భక్తులు ప్రశ్నిస్తే పార్కింగ్ సిబ్బంది దురుసుగానే ప్రవర్తిస్తున్నారు. అమాయకులపై చేయి కూడా చేసుకుంటున్నారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన ధర్మపురిలో భక్తుల సౌకర్యార్థం వేములవాడ మాదిరిగా ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సింది పోయి అధికంగా వసూళ్లు చేయడం పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబందిత అధికారులు స్పందించి ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించకపోయిన కనీసం పెంచిన పార్కింగ్ రుసుమునైనా తగ్గించాలని భక్తులు కోరుతున్నారు.