Parents protest | మెట్పల్లి, ఆగస్టు7: రాఖీ పండుగకు తమ పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. తమకు ఎలాంటి ఆదేశాలు లేవంటూ పిల్లలను పంపించేందుకు ప్రిన్సిపాల్ నిరాకరించడంతో పిల్లల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. గురువారం సాయంత్రం మెట్పల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల (బీర్పూర్) వద్ద ఈ ఘటన జరిగింది. ఈ నెల 9న రాఖీ పౌర్ణమి ఉన్న నేపథ్యంలో వివిధ గ్రామాల నుంచి తల్లి దండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లడం కోసం ఉదయ పాఠశాలకు వచ్చారు.
తరగతుల నిర్వహణ తర్వాత పిల్లలను బయటకు పంపిస్తారని తల్లిదండ్రులు పాఠశాల గేటు వద్ద నిరీక్షించారు. తరగతుల నిర్వహణ మే గడిచినా పిల్లలను పంపించేందుకు గేటు తెరవకపోవడంతో ప్రిన్సిపాల్‌తో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ ప్రిన్సిపాల్ అందుకు ససేమిరా అనడంతో పాఠశాల ఎదుట ఆ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో అర్ధగంట పాటు వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. పాఠశాల లోపల నుంచి ప్రిన్సిపాల్ బయటకు రావడంతో ఆందోళన విరమించి ఆమె వద్దకు తల్లిదండ్రులు వెళ్లారు.
కాగా ఒకే సారి వంద మంది పిల్లలను పంపించలేమని మరో సారి ప్రిన్సిపాల్ స్పష్టం చేయడంతో కొందరు తల్లిదండ్రులు వెనుదిరుగగా మరికొందరు అక్కడే తమ పిల్లల కోసం నిరీక్షించారు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక అయినా రాఖీ పండుగకు పిల్లలను ఇంటికి పంపించకపోవడంపై ప్రభుత్వ తీరుపై పలువురు తల్లిదండ్రులు మండిపడ్డారు.