Best Available School students | హుజూరాబాద్, అక్టోబర్ 8 : బెస్ట్ అవైలబుల్ స్కూల పథకం కింద ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న వెనుకబడిన విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తల్లిదండ్రులు కలిసి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారికి హుజూరాబాద్ లో వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు రాకపోవడంతో తమ పిల్లల విద్య ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. జమ్మికుంటలోని మాస్టర్స్, ఎస్వీ హైస్కూల్, విద్యోదయ హైస్కూల్, న్యూ మిలీనియం హైస్కూల్, హుజూరాబాద్‌లోని మాంటెస్సోరి, టెట్రా హైస్కూల్స్ యాజమాన్యాలు పిల్లలను రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజులు పెండింగ్‌లో ఉండటం వల్ల బుక్స్, భోజనం ఖర్చులు తమకు భారంగా మారాయని తెలిపారు. దసరా సెలవుల అనంతరం తమ పిల్లలను కనీసం స్కూల్ ఆవరణలోకి కూడా అనుమతించడం లేదని, దీంతో తమ పిల్లల చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. వెనుకబడిన పిల్లల విద్య భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం తక్షణమే స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఫీజు బిల్లులను విడుదల చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టకపోతే, విద్యార్థులతో సహా ధర్నాలు, రాస్తారోకాలు వంటి ఉద్యమ కార్యక్రమాలు చేపట్టడానికి వెనకాడబోమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ అవైలబుల్ పిల్లల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.