కరీంనగర్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 10లోగా తమ డిమాండ్లను పరిష్కరించకుంటే సమ్మె బాట పడతామని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం సీఐటీయూ పరిధిలోని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్‌కు సమ్మె నోటీసు అందించారు.
తక్షణమే 18 వేల కనీస వేతనం అందించి, గ్రీన్ చానల్ ద్వారా ప్రతి నెలా 10 లోగా చెల్లించేలా చర్యలు తీసుకోవాని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమకిచ్చే అరకొర జీతాలను కూడా ప్రతి నెలా ఇవ్వడం లేదని, నెలల తరబడి బకాయిలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు.
మల్టీ పర్పస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, కార్మికులందరికీ పీఎఫ్, ఈపీఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద వశాత్తు మరణించిన కార్మికుల కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఆన్లైన్లో నమోదుకాని కార్మికుల పేర్లను వెంటనే నమోదు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5 లక్షలు చెల్లించాలని, పంచాయతీ సి బ్బంది అందరినీ పీఆర్సీ పరిధిలోకి తేవాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ భద్రత కల్పిస్తామని, కనీస వేతనం చెల్లిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి ఇప్పుడు మర్చి పోయిందని ధ్వజమెత్తారు. ఇచ్చి న హామీలను అమలు చేయకుంటే సమ్మెకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు.
సమ్మె నోటీసు ఇచ్చిన వారిలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాచర్ల మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు కాశిపాక శంకర్, జిల్లా కోశాధికారి ఎండిగ రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు మొలుగూరు ప్రేమ్‌కుమార్, శంకర్, వడ్లూరి లక్ష్మీనారాయణ, ఇమ్మడి శ్రీకాంత్, లద్దునూరి కుమార్, సంపత్, రవి, సమ్మయ్య పాల్గొన్నారు.