కోడికూయక ముందే వీధుల బాట పట్టి, పల్లెల్లో వెలుగులు నింపే పంచాయతీ కార్మికుల జీవితాల్లో అంధకారం అలుముకున్నది. నెలనెలా ఇవ్వాల్సిన వేతనాలను కాంగ్రెస్ సర్కారు ఐదారు నెలలైనా అందజేయకపోవడంతో సిబ్బంది కడుపు మాడుతున్నది. ఈ రెండేండ్లలో పైసా పెంచకపోగా, అవి కూడా రెగ్యులర్గా రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ అర్ధాకలితో బతుకులు వెళ్లదీయాల్సిన దుస్థితి దాపురించింది
కరీంనగర్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో పొద్దున ఊరు నిద్ర లేవక ముందే పంచాయతీ సిబ్బంది విధులు మొదలవుతాయి. రోడ్లు, మురుగు కాలువలు శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు, తాగు నీటిని సరఫరా చేసే పంప్ ఆపరేటర్లు, పన్నుల వసూళ్లకు బయలుదేరే కారోబార్లు, బిల్ కలెక్టర్లు, రాత్రి వెలిగించిన లైట్లను ఆర్పే పనిలో విద్యుత్ కార్మికులు కనిపిస్తారు. ఈ కార్మికులు లేకుంటే గ్రామాల పరిస్థితి ఊహించలేం. ప్రతి రోజూ పంచాయతీ సిబ్బంది పనిచేస్తేనే గ్రామీణ వ్యవస్థల సేవలు ప్రజలకు అందుతాయి. ఇన్ని సేవలందిస్తున్న వీరిని ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు గుర్తించ లేదు. పారిశుధ్యం పనులు చేయడమంటే నిత్యం దుర్గంధాన్ని భరించక తప్పదు. గ్రామాల్లో మంచి వాతావరణాన్ని పంచే వీరి కోసం గతంలో ఏ ప్రభుత్వం తీసుకోలేని నిర్ణయాలను కేసీఆర్ సర్కారు తీసుకున్నది. అంతకు ముందు పంచాయతీలు ఎంత తీర్మానిస్తే అంతే వేతనం కార్మికులకు అందేది. గ్రామ ఆదాయాన్ని బట్టి వీరి వేతనాలు నిర్ణయించబడేవి. ఏండ్ల తరబడి పంచాయతీల్లో చాకిరీ చేసినా నెలకు కనీస వేతనం అందేది కాదు. వెయ్యి, రెండు వేలు ఇచ్చిన పంచాయతీలు కూడా ఉన్నాయి. కానీ, 2019 నవంబర్లో కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీ సిబ్బందికి సమాన వేతనంగా నెలకు 8,500 పెంచింది. ఆ తర్వాత వచ్చిన కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మరో వెయ్యి పెంచింది. మొత్తంగా పంచాయతీ కార్మికులకు నెలకు 9,500 కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నేరుగా వారి ఖాతాల్లో జమయ్యేవి. అంతేకాకుండా పంచాయతీ సిబ్బందికి మల్టీపర్పస్ వర్కర్స్ (ఎంపీడబ్ల్యూ)గా గుర్తించింది. పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న ప్రతి సిబ్బందికి సమాన వేతనం అందించింది. కాగా, ఈ రెండేండ్లుగా కరీంనగర్ జిల్లాలో 1653 మందికి ఐదారు నెలలకు ఒకసారి వేతనాలు వస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 1260 మందికి రెగ్యులర్గా వేతనాలు వస్తున్నప్పటికీ 600 మందికి మాత్రం 14 నెలలుగా అందడం లేదని వాపోతున్నారు.
పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచడంతోపాటు వారికి 2 లక్షల జీవిత బీమాను గత కేసీఆర్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే భరించింది. పంచాయతీ రాజ్ ఉద్యమానికి ఆధ్యుడైన ఎస్కేడే పేరుతో ఈ పథకాన్ని అమల్లోకి తేవడంతో పంచాయతీ కార్మికుల కుటుంబాలకు దీమా ఏర్పడింది. కారోబార్లు, బిల్ కలెక్టర్లు, గ్రామ విద్యుత్ కార్మికులు, పంప్ ఆపరేటర్లు, పారిశుధ్య కార్మికులు, కంప్యూటర్ ఆపరేటర్లు ఒక్కొక్కరి పేరిట 2 లక్షల జీవిత బీమా అమలు చేశారు. దీనికి అవసరమైన ప్రీమియాన్ని ప్రతి ఏటా ప్రభుత్వమే భరించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి పథకం గతంలో అమలు కాలేదు. జీవిత బీమా ప్రీమియం కింద 100 చెల్లిస్తే మరణించే కార్మికుడి కుటుంబానికి 75 వేలు క్లయిం అయ్యేది. అయితే పంచాయతీలు పట్టించుకోక పోవడంతో ఈ పథకం అమలుకు నోచుకోలేదు. నిధులు లేక కొన్ని, నిధులు ఉన్నా చెల్లించలేక కొన్ని పంచాయతీలు ఈ పథకం అమలుకు ముందుకు రాలేదు. 2019 తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే స్వయంగా పూర్తి ఉచితంగా ప్రీమియం చెల్లించింది. దీంతో ఇటు పంచాయతీలపై భారం తప్పింది. కార్మికులకు న్యాయం జరిగింది.
సకాలంలో ఎన్నికలు నిర్వహించక పోవడంతో రెండేళ్లుగా పంచాయతీ కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. నెల నెలా అందాల్సిన వేతనాలు ఎప్పుడో ఐదారు నెలలకు ఒకసారి రావడంతో కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు వీరి కోసం ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో పంచాయతీ కార్మికులు రెండేళ్లలో రెండు మూడు సార్లు సమ్మెకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. అయినా వారి సమస్యకు ఒక పరిష్కారం లభించలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పెంచిన వేతనాలే తప్పా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పెరిగింది లేదు. కనీసం పండుగల సమయంలో కూడా వీరికి వేతనాలు అందలేదు. ఐదారు నెలలకోసారి వేతనాలు అందించడంతో అప్పటి వరకు చేసిన అప్పులకే సరిపోతున్నాయని, జీవితం గడవాలంలే కొత్తగా అప్పులు చేయక తప్పని పరిస్థితి తమదని పంచాయతీ కార్మికులు వాపోతున్నారు. వేతనాలు అందక బతుకు గడవక చాలా మంది పంచాయతీ కార్మికులు, సిబ్బంది పనులు మానుకుని ఇతర వృత్తుల్లోకి వెళ్లారు. బీమా ప్రీమియం చెల్లించని కారణంగా ఇటీవల చనిపోయిన కార్మికులకు రూ.2 లక్షలు కూడా రావడం లేదు. ఇంత దుర్భర పరిస్థితుల్లో పంచాయతీ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సారి ఎన్నికలు పూర్తయిన తర్వాతనైనా తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయన్న భరోసా వారిలో కలగడం లేదు.