Collector Koya Sri Harsha | ధర్మారం, డిసెంబర్ 8 : ఈనెల 14న ధర్మారం మండలంలో రెండో విడత నిర్వహించే పంచాయతీ ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ధర్మారం మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఐ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ డి శ్రీనివాస్, ఎంపీవో రమేష్ తో ఎన్నికల నిర్వహణ పై వారికి ఆయన దిశా నిర్దేశం చేశారు.
ఈ నెల 9న పోలింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమం కట్టుదిట్టంగా నిర్వహించాలని, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో తమ వెంట ఫారం-14, ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ తీసుకుని రావాలని, రెండో విడత పోలింగ్ సిబ్బంది డిసెంబర్ 9న తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ పంపిణీ నిబంధనల ప్రకారం సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.