నేతన్నల సంక్షేమానికి అహర్నిశలూ కృషిచేస్తున్న రాష్ట్ర సర్కారు, నేత వృత్తే ఆధారంగా బతికే పద్మశాలీలకు పట్టం కట్టింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో గత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రస్థాయిలో అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ఇప్పటికే చేనేత, మరమగ్గాల పరిశ్రమలకు వేర్వేరుగా సంస్థలను ఏర్పాటు చేసి భరోసా కల్పించిన ప్రభుత్వం, తాజాగా తెలంగాణ రాష్ట్ర పవర్‌లూం, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తొలి చైర్మన్ పదవిని సిరిసిల్ల పద్మశాలీ ముద్దుబిడ్డ గూడూరి ప్రవీణ్‌కు కట్టబెట్టగా, నేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో పటాకులు కాల్చి సంబురాలు చేసుకోవడమే కాదు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతగా చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
– రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 13 (నమసే తెలంగాణ)
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 13 (నమసే తెలంగాణ): ఆది నుంచీ చేనేత, మరమగ్గాల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చేనేత, మరమగ్గాల పరిశ్రమలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర పవర్‌లూం, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తొలి చైర్మన్ పదవిని సిరిసిల్లకు చెందిన గూడూరి ప్రవీణ్‌కు కట్టబెట్టింది. సిరిసిల్ల నేతకుటుంబానికి చెందిన ఆయన, ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రవీణ్‌ను నియమించడంపై పద్మశాలీలు మంగళవారం సంబురాలు చేసుకున్నారు. పాలిస్టర్, కాటన్ వస్త్ర ఉత్పత్తిదారులు, ఆసాములు, మరమగ్గాల, చేనేత కార్మికులు సిరిసిల్లలోని నేతన్న చౌక్ వద్ద సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు.
నేతన్నల పక్షపాతి కేటీఆర్..
సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పెనుసంక్షోభాన్ని ఎదుర్కొన్నది. వందల సంఖ్యలో కార్మికులు ఆకలిచావులు, ఆత్మహత్యలకు పాల్పడ్డారు. స్వరాష్ట్ర ఉద్యమంలో సిరిసిల్ల పర్యటనకు వచ్చిన కేసీఆర్ ఇక్కడి కార్మికుల దయనీయ స్థితిని చూసి చలించిపోయారు. వెంటనే పార్టీ ఫండ్ రూ.50లక్షలను నేతన్నల సంక్షేమం కోసం పద్మశాలీ ట్రస్టుకు అందజేశారు. నేతన్నల సమస్యలపై స్థానిక శాసన సభ్యుడిగా కేటీఆర్ సమైక్యపాలనలో శక్తివంచన లేకుండా పోరాటం చేశారు. కనికరం చూపని పాలకుల వల్ల పరిశ్రమకు చేయూత కరువైంది. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎమ్మెల్యే కేటీఆర్.. మంత్రి కావడం సిరిసిల్లకు బాగా కలిసి వచ్చింది. నేతన్నల సంక్షేమానికి ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. నేతన్నలకు ఆయన వెన్నుదన్నుగా నిలిచి వేల కోట్ల వస్ర్తాల తయారీ ఆర్డర్లు ఇప్పించి ఆదుకున్నారు. బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లతో భరోసా కల్పించారు. ఇంకా రైతుల మాదిరిగా నేతన్నకు రూ.5లక్షల బీమాతో కుటుంబాలకు ధీమా కల్పించారు. ఆయన చొరవతోనే నేడు సిరిసిల్ల 70 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. సమైక్య పాలకుల పాలనలో అణచబడ్డ నేతన్న తెలంగాణ ప్రభుత్వంలో తల ఎత్తుకునే స్థాయికి ఎదిగేలా చేశారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన టీపీటీడీసీఎల్ సంస్థకు తొలి చైర్మన్‌గా ప్రవీణ్‌ను నియమించడం సిరిసిల్ల కీర్తి ప్రతిష్టలు పెంచేలా చేసింది. రాష్ట్రస్థాయిలో గొప్ప పదవి దక్కగా, పద్మశాలీలకు అరుదైన గౌరవం దక్కింది.
బయోడేటా
పేరు : గూడూరి ప్రవీణ్
తండ్రి : కీ.శే. రాజయ్య
స్వస్థలం : సుభాష్‌నగర్, సిరిసిల్ల
చదువు : ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఫిల్
భార్య : మంజుల (మాజీ కౌన్సిలర్)
పిల్లలు : కూతురు, కొడుకు
కూతురు : ప్రత్యూష (ఎంటెక్ -అమెరికా)
అల్లుడు: కిరణ్ (బీటెక్ ఎంఎస్ -అమెరికా)
కొడుకు : మానస్ (బీటెక్ ఎంఎస్-అమెరికా)
పదవులు : సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్, సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్లానింగ్ డెవలప్మెంట్ కమిటీ కార్యదర్శిగానూ పనిచేస్తున్నారు.
సిరిసిల్లకు మంచి పేరు తీసుకొస్తా..
నేతన్నల సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉన్నది. వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి, యజమానులు, ఆసాములు, చేనేత, పవర్‌లూం కార్మికుల సంక్షేమానికి అహర్నిశలూ కష్టపడుతా. కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తా. అసాధ్యాలను సుసాధ్యం చేసే శక్తి ఒక్క కేసీఆర్‌కే ఉంది. తెలంగాణ ప్రభుత్వం సిద్ధించిన తర్వాత ప్రత్యేక దృష్టితో నేతన్నల బతుకు చిత్రం మార్చారు. ఏటా రూ.400కోట్ల విలువైన బతుకమ్మ చీరెలు, పాఠశాల యూనిఫాంలు, ఆర్వీఎం దుస్తుల ఆర్డర్లతో నేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఏ లక్ష్యం కోసమైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో ఆ పథకాలు కింది స్థాయిలోని నేత కుటుంబాలందరికీ అందేలా ప్రయత్నం చేస్తా. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్డర్లను సమాన స్థాయిలో వచ్చేందుకు కృషి చేస్తా. నాపై నమ్మకం ఉంచి టీపీటీడీసీఎల్ చైర్మన్‌గా తనకు బాధ్యతలు అప్పగించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పార్టీ పెద్దలు, మంత్రి సహకారంతో సిరిసిల్లకు మంచి పేరు తీసుకొస్తా.
– గూడూరి ప్రవీణ్, టీపీటీడీసీఎల్ చైర్మన్