హుజూరాబాద్, జూలై 22 : హుజూరాబాద్ గడ్డ ఎప్పటికీ కేసీఆర్ అడ్డా అని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని, ఉరికించి కొడతామని హెచ్చరించారు. రానున్న గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో నియోజకవర్గంలో ప్రతీ చోట బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి తీరుతామని చెప్పారు. ఈటల రాజేందర్ పెద్ద మోసగాడని, టికెట్ ఇచ్చి అన్నం పెట్టిన కేసీఆర్‌తోపాటు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను, నమ్ముకున్న కార్యకర్తలను కూడా మోసం చేశాడని ధ్వజమెత్తారు. ఆయనను నమ్ముకొని మోసపోయిన నాయకులు, కార్యకర్తలు అధైర్య పడొద్దని, పార్టీలోకి తిరిగి వస్తే వారికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈటల బీఆర్ఎస్ నాయకుల జోలికి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్‌కు కేసీఆర్‌ను విమర్శించే స్థాయి లేదని, కేసీఆర్ పెట్టిన భిక్షతో పదవులు పొంది ఇప్పుడు ఆయననే విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. దేవుడు లాంటి కేసీఆర్‌ను విమర్శిస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. బీఆర్ఎస్లో ఉండి పార్టీకే వెన్నుపోటు పొడిచిన ఆయనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారని, పేదల నెత్తుటి రక్తాన్ని పీల్చి వందల ఎకరాలు కబ్జా చేసిన ఈటలను కేసీఆర్ పార్టీ నుంచి వెళ్లగొట్టారని గుర్తు చేశారు. బీసీల మీద అప్పుడు లేని ప్రేమ ఇప్పుడెలా పుట్టిందని ప్రశ్నించారు. కొడుకు, బిడ్డ పేరు పక్కన రెడ్డి అని పెట్టుకున్న ఈటల బీసీ ఎలా..? అవుతాడని ప్రశ్నించారు.
ఆయన బీసీ ముసుగులో ఉన్న దొర అని ధ్వజమెత్తారు. ఈటల బీఆర్ఎస్లో చేరకముందే తన నాన్న పాడి సాయినాథ్‌రెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు హుజూరాబాద్ నియోజకవర్గంలో అన్ని స్థానాలను గెలిపించారని గుర్తు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌తో వెళ్తే తాను బీజేపీలో కలుస్తానంటూ ఈటల మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. అలా అయితే ఈటల భట్టి విక్రమార్కతో ఒక ఫంక్షన్‌కు వెళ్లారని, అక్కడ దిగిన ఫొటో ఆయన అఫీషియల్ అకౌంట్లో పోస్టు చేశారని తెలిపారు. బండి సంజయ్ ట్రాప్‌లో తాను పడ్డానని ఈటల మాట్లాడుతున్నారని, కానీ బండి ట్రాప్‌లో పడింది తాను కాదని ఈటలేనని స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఆయనను ఎప్పుడో మరిచి పోయిందని, ఎలాంటి మద్దతు దొరకదనే విషయాన్ని మర్చిపోకూడదని హితవుపలికారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయిందని విమర్శించారు.
నియోజకవర్గంలో సుమారు 40 వేల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారని, వారందరికీ వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీలను నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణరావు, మాజీ ఎంపీపీలు రాణి సురేందర్‌రెడ్డి, ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, కన్నూరి సత్యనారాయణరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక-శ్రీనివాస్, రాజేశ్వర్‌రావు, ఐలయ్య, రంజిత్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.