రాజన్న సిరిసిల్ల, మే 21 (నమస్తే తెలంగాణ) : రైతన్న ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం వర్షార్పణమైంది. అధికారుల నిర్లక్ష్యం శాపంలా మారి కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయింది. బుధవారం తెల్లవారు జామున, సాయంత్రం పడిన వర్షానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసుకున్న వడ్ల కుప్పలపై ప్లాస్టిక్ కవర్లు కప్పినప్పటికీ గాలి దుమారానికి లేచిపోయి వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది.
దీంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్‌పల్లి, ఇల్లంతకుంట మండలం పొత్తూరు, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, కోనరావుపేట మండలంలోని నిజామాబాద్, రుద్రంగి మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ధాన్యం కుప్పలు తడిశాయి. పెద్దపల్లి జిల్లా మంథని, గోదావరిఖనిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుల మోత ప్రజలను భయకంపితులను చేసింది.
జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పోసిన వరిధాన్యం పూర్తిగా తడిసిపోయింది. సారంగాపూర్, బీర్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం, సాయంత్రం ఈదురు గాలులు, ఉరుముల శబ్దంతో వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా గంగాధర, తిమ్మాపూర్ మండలకేంద్రాలతోపాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. గంగాధరకు వెళ్లే దారిలో రోడ్డుకు అడ్డుగా చెట్టు కూలిపోవడంతో తాజా మాజీ సర్పంచ్ మడ్లపెల్లి గంగాధర్ స్థానికుల సహకారంతో తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు.
నాది వెల్లుల్ల అనుబంధ గ్రామం మాసాయిపేట్. నాకు రెండున్నర ఎకరాల పొలం ఉన్నది. నేను పండించిన ధాన్యాన్ని ఇరువై రోజుల క్రితం మెట్పల్లి వ్యవసాయ మార్కెట్‌కి తెచ్చిన. అడిగి ప్రతిసారి రేపు రా సంచులిస్తం.. కాంటా వేస్తం అన్నరు. కానీ, సంచులిస్తలేరు. కాంటా వేస్తలేరు. అసలు కొంటరా..? లేదా..? అని అధికారులను అడిగితే నిర్లక్ష్యంగా జవాబిస్తున్నరు. మబ్బులు పడితే మేం భయపడతున్నం. ఎట్ల కాపాడుకోవాలోనని ఆగమైతున్నం. ప్రభుత్వం దయ చూపాలె. తడిసిన ధాన్యాన్ని కొని రైతులను ఆదుకోవాలె.
– బొమ్మిడి రాజం, రైతు, మాసాయిపేట్ (వెల్లుల్ల)