చిగురుమామిడి, డిసెంబర్ 24: అసౌకర్యాల మధ్య కొనసాగుతున్న పంచాయతీలకు ప్రభుత్వం ఇటీవల నూతన భవనాలను మంజూరు చేయడంపై ఆయా గ్రామాల ప్రజాప్రతినిధుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. మండలంలో 17 జీపీలకు గాను 10 నూతన గ్రామపంచాయతీ భవనాలను జాతీయ ఉపాధి హామీ పథకంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గాగిరెడ్డి పల్లె, గునుకుల పల్లె, కొండాపూర్, లంబాడి పల్లి, ముదిమాణిక్యం, నవాబుపేట, ఓబులాపూర్, పీచుపల్లి, సీతారాంపూర్, ఉల్లంపల్లి గ్రామ పంచాయతీలకు నూతన కార్యాలయాల నిర్మాణానికి రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని భావిస్తున్నది. గతంలో పంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి రూ.16 లక్షల చొప్పున మంజూరు చేయగా, ప్రస్తుతం నిర్మాణ సామగ్రి ధరలు పెరుగడంతో దాదాపు రూ.20 లక్షల వరకు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. గ్రామపంచాయతీ తీర్మానం మేరకు భవనాలను నిర్మించనున్నారు.
మార్గదర్శకాలు రావాల్సి ఉంది..
ప్రభుత్వం పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణానికి గాను ఉత్తర్వులు జారీ చేసింది. వాటి నిర్మాణాలకు నిబంధనలు, మార్గదర్శకాలు రావాల్సి ఉంది. వాటి ద్వారా పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రూ.20 లక్షల వ్యయంతో నిర్మించాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని సర్పంచులు సద్వినియోగం చేసుకుంటే పంచాయతీలకు శాశ్వత భవనాలు సమకూరుతాయి.
– నర్సయ్య, ఎంపీడీవో, చిగురుమామిడి
ఇబ్బందులు తొలగుతాయి…
చాలాకాలంగా చిన్న గదుల్లో పంచాయతీ కార్యాలయాన్ని నిర్వహించాం. అధికారులు వస్తే కూర్చునేందుకు అవకాశం లేకుండా ఉండేది. మా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం స్పందించి పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరం.
-సన్నీల్ల వెంకటేశం, సర్పంచ్, గాగిరెడ్డిపల్లె
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
గ్రామపంచాయతీ కార్యాలయంలో సమావేశాల నిర్వహణకు ఎదురవుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే సతీశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లాం. ఈ క్రమంలో ప్రభుత్వం వెంటనే స్పందించి మండలంలో నూతన జీపీ భవనాలు మంజూరు చేయడం హర్షణీయం. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సతీశ్ కుమార్ కు కృతజ్ఞతలు.
-పెద్దపల్లి భవాని, సర్పంచ్, కొండాపూర్