మెట్పల్లి, జూలై 10: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ వంటి అనవసరమైన వాటితో కాలయాపన చేస్తూ పాలనను గాలికివదిలేసిందని, ప్రధానంగా విద్యావ్యవస్థ కుదేలైపోయిందని బీఆర్ఎస్ నాయకుడు, గురుకులాల సొసైటీ రాష్ట్ర మాజీ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. మళ్లీ సీఎంగా కేసీఆర్ వస్తే తప్ప రాష్ట్రంలో విద్యావ్యవస్థ బాగుపడదని చెప్పారు. మెట్పల్లి పట్టణ శివారులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను గురువారం సాయంత్రం ఆయన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్లతో కలిసి పరిశీలించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల సంఖ్య, వసతులు, తదితర అంశాలు అడిగారు. తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు నిర్మూలించే కార్యక్రమాల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్ 660 గురుకులాలను ఏర్పాటు చేయడంతో పాటు రెండు దఫాలుగా 17 వేల ఉద్యోగులను నియమించారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గురుకులాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
అనేక చోట్ల గురుకులాలకు సొంత భవనాలు లేవని, స్థలాలు ఉన్నా నిర్మించడం లేదని, వసతులు కల్పించడం లేదన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పేరుతో ప్రతి నియోజకవర్గంలో స్కూల్‌ను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ అందుకు అవసరమైన కార్యచరణ చేపట్టడం లేదని, సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఒకే చోట స్కూల్‌ను ఏర్పాటు చేసి 2560 మంది విద్యార్థులను చదివిస్తానన్న మాట ఆరు నెలలు అవుతున్నా ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. ఇంజినీరింగ్, తదితర విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో చదువు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిర్ణీత సీట్లలో చదివే పేదలకు ప్రభుత్వం బెస్ట్ అవైలెబుల్ స్కీం కింద ఫీజులు చెల్లించకపోవడం సరికాదన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు ప్రభుత్వం విద్యార్థులను ఎంపిక చేసి ప్రతి ఏటా రూ.10 కోట్లు ఇచ్చేదని, ప్రస్తుత ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో రెండేళ్లుగా ప్రభుత్వం తరఫున అడ్మిషన్లను పబ్లిక్ స్కూల్ నిర్వాహకులు నిలిపేశారని తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పనితీరుపై ఈ సందర్భంగా ఆయన ప్రశంసలు కురిపించారు. నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారని, ఆయన లాంటి ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎవరూ లేరని కొనియాడారు.
విద్యుత్ కోతలు ఎక్కువ ఉండడం వల్ల పాఠశాలలో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతున్నదని విద్యార్థులు, నిర్వాహకులు ఎమ్మెల్యే సంజయ్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు విన్నవించారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే 15 కేవీ జనరేటర్‌ను అందజేస్తానని హామీ ఇచ్చారు.