అధికారంలోకి రాగానే వడ్లు క్వింటాల్‌కు 500 బోనన్ చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్, తీరా ఆ హామీని నెరవేర్చకుండా రెండు సీజన్లకు ఎగనామం పెట్టింది. పైగా మాట మార్చి ‘సన్న వడ్లకే బోనస్’ అంటూ వానకాలం సీజన్లో అమలు చేసింది. అయితే పాలకుల మాటలను నమ్మి సన్నాల దిగుబడులను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. రెండున్నర నెలలు దాటినా బోనస్ డబ్బులు రాక సుమారు 20వేల మంది రైతులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఇంకా 41 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఎప్పుడిస్తారో తెలియక అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
జగిత్యాల, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వరికి మద్దతు ధరతోపాటు క్వింటాల్‌కు 500 బోనస్‌గా ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీ సైతం వరికి బోనస్ ఇస్తామని చెప్పింది విధితమే. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వరికి బోనస్ ఇచ్చే విషయంలో కొర్రీలు పెట్టింది. దొడ్డురకం వరికి బోనస్ ఇచ్చేది లేదని, సన్నాలకు మాత్రమే ఇస్తామని చెప్పడంతోపాటు సన్న వడ్లుగా నిర్ధారించేందుకు సవాలక్ష ఆంక్షలు విధించింది. అయినా, వాటన్నింటిని దాటుకొని ఉమ్మడి జిల్లా రైతులు లక్షలాది ఎకరాల్లో సన్నరకం వడ్లు సాగు చేశారు.
సేద్య జిల్లాగా ముఖ్యంగా, వరికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన జగిత్యాల జిల్లాలో గత వానకాలం సీజన్లో 3.17 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులో 85 వేల ఎకరాల్లో సన్నాలు పండించారు. అయితే ఈ జిల్లాలో మెజార్టీ శాతం ఒప్పంద పద్ధతిలో వేశారు. వానకాలం పంట ప్రారంభానికి ముందే పయనీర్, కావేరి, బేయర్, మహేంద్ర వంటి ప్రముఖ కంపెనీలతో పలువురు రైతులు క్వింటాల్‌కు 2600 నుంచి 2800 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకొని సన్నాలు సాగు చేశారు. ఒకవేళ ప్రభుత్వం 500 బోనస్ ప్రకటిస్తే.. ప్రతి క్వింటాల్‌కు అంత మొత్తంలో చెల్లించేందుకు అంగీకారం చేసుకున్నారు. 85వేల ఎకరాల్లో సగటున 2.14 లక్షల టన్నుల సన్నధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేశారు. తీరా చూస్తే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కేవలం 30,092 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. దిగుబడిని విక్రయించి దాదాపు మూడు నెలలు గడుస్తున్నా, ఇంత వరకు పూర్తిస్థాయిలో బోనస్ డబ్బులు అందకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
రెంటికి చెడ్డ రేవడిలా..
వానకాలంలో బహిరంగ మార్కెట్లో సన్నరకం ధర క్వింటాల్‌కు 2,750 పలికింది. రేవంత్ సర్కారు మద్దతు ధరతోపాటు 500 బోనస్ కూడా ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో వారి మాటలు నమ్మి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. బహిరంగ మార్కెట్లో ఉన్న ధర దక్కక, బోనస్ అందక లబోదిబోమంటున్నారు. జగిత్యాల జిల్లాలో చూస్తే 31,092 టన్నుల సన్నధాన్యానికి క్వింటాల్‌కు 500 చొప్పున 15.54 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 3.62 కోట్లు మాత్రమే చెల్లించారు. మరో 11.92 కోట్లు చెల్లించాల్సి ఉండగా, అవి ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కనీసం ప్రభుత్వం ఎప్పుడిస్తుందో చెప్పడం లేదు, అధికారులకు స్పష్టత లేదు. మరోవైపు రైతుభరోసా కూడా ఇవ్వకపోవడంతో మళ్లీ అప్పుల కోసం వెంపర్లాడే దుస్థితి తలెత్తింది.
సన్నాల సాగుకు కష్టాలు ఎక్కువ
దొడ్డురకం కంటే సన్నరకం సాగు చేయడానికి కష్టాలు ఎక్కువ. సహజంగా దొడ్డురకం పంటకాలం 135 రోజుల వరకు ఉంటే, సన్నవడ్లు 165 రోజుల వరకు ఉంటుంది. ఫలితంగా నెల రోజులు అదనంగా శ్రమించాల్సి వస్తుంది. పంటపెట్టుబడి సైతం పెరుగుతుంది. సాధారణ రకాలతో పోల్చిచూస్తే 4 వేల నుంచి 5 వేల వరకు అధికంగా అవుతుంది. అలాగే, సన్నాలకు నల్లకాటుక రోగం, దోమపోటు, మెడవిరుపు, సుడిదోమపోటు వంటి ప్రమాదకరమైన చీడపీడలు సోకే ప్రమాదమున్నది. అవి సోకితే పెట్టుబడి మరింత పెరుగుతుంది. అలాగే, దిగుబడి దొడ్డురకం ఎకరాన 29 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటే.. సన్నరకం కేవలం 23 నుంచి 25 క్వింటాళ్లే వస్తాయని రైతులు చెబుతున్నారు. వ్యయప్రయాసాలకు ఓర్చి సన్నాలు సాగు చేసి విక్రయిస్తే.. రెండున్నర నెలలు గడిచినా బోనస్ డబ్బులు ఇవ్వకపోవడం అన్యాయమని ఆవేదన చెందుతున్నారు.
బోనస్ అందక దమ్మన్నపేట రైతుల దిగాలు
ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన రైతులు సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా వ్యవసాయం చేయడంలో పేరు గాంచారు. చాలా గ్రామాల్లో దొడ్డురకం వరిని పండిస్తుంటే.. వీరు మాత్రం సన్నరకం పండించేందుకే మొగ్గుచూపుతున్నారు. గ్రామంలో 1510 ఎకరాల సేద్యభూమి కాగా, గత వానకాలం 450 మంది రైతులు 1200 ఎకరాల్లో జై శ్రీరామ్ రకానికి చెందిన సన్నరకం సాగు చేసి, దాదాపు 28 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని పండించారు. అందులో చాలా మంది పంట కల్లంలో ఉండగానే ఆసాములు, వ్యాపారులకు విక్రయించుకున్నారు. దాదాపు 250 మంది రైతులు మాత్రం బోనస్ వస్తుందన్న నమ్మకంతో కొనుగోలు కేంద్రానికి తెచ్చి దాదాపు 7వేల క్వింటాళ్లు విక్రయించారు. ఈ లెక్కన వీరికి 35 లక్షలు బోనస్ రూపేనా రావాల్సి ఉంది. దాదాపు రెండున్నర నెలలుగా ఎదురు చూస్తున్నా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. విసిగి పోయి సోమవారం జగిత్యాల ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేశారు. అప్పులు సప్పులు చేసి పంట పండించామని, యాసంగి పంట పెట్టుబడికి తిప్పలైతందని, దయ ఉంచి. తమ సన్నపడ్లకు బోనస్ పైసలు ఇప్పించాలని కలెక్టర్‌ను కలిసి వేడుకున్నారు.
బోనస్ ఇయ్యలే.. రైతు భరోసా రాలే..
నాకున్న నాలుగెకరాల్లో సన్నరకం వేసిన. 100 క్వింటాళ్లు వచ్చినయ్. 50 క్వింటాళ్లు షావుకారికి అమ్మిన. 50 క్వింటాళ్లు కొనుగోలు కేంద్రంలో అమ్మిన. 25 వేల బోనస్ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు రాలేదు. మా ఊరు రైతులందరం కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినం. ఎప్పుడు వస్తయా.. అని ఎదురు చూస్తున్నం. రైతు భరోసా కూడా రాలే.
– పెంచాల రామన్న, రైతు (దమ్మన్నపేట)
బోనస్ రాలేదు.. రుణమాఫీ కాలేదు..
మాకున్న మూడున్నర ఎకరాల్లో సన్నరకం వేసిన. దాదాపు 50 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించిన. 25 వేల బోనస్ రావాలి. ఇంతవరకు అందలేదు. రైతు భరోసా కూడా రాలేదు. 1.80 లక్షల రుణ మాఫీ కూడా కాలేదు. ప్రభుత్వాలు రైతులను ఇలా మోసం చేయడం మంచిది కాదు.
– మైదం శ్రీనివాస్, రైతు, (దమ్మన్నపేట)
బోనస్ ఇస్తమంటేనే సన్నరకం వేసినం
క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తమని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తేనే సన్నరకం వేసినం. జైన సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మి దాదాపు రెండు నెలలు దాటింది. ఇప్పటివరకు బోనస్ అందలేదు. నాకు ఎకరన్నర పొలం ఉన్నది. సన్నరకం సాగు చేసిన. 30 క్వింటాళ్ల వరకు సంఘం కేంద్రంలో అమ్ముకున్న. 15 వేల బోనస్ రావాల్సి ఉంది. రైతుభరోసా జమకాలేదు. కనీసం నాకు రావాల్సిన బోనస్ డబ్బులు 15 వేలు అందితే పెట్టుబడికన్నా అయితయ్.
– మంతుర్తి భూమన్న, రైతు (దమన్నపేట)
ఇప్పటి వరకు దిక్కులేవు
సన్నరకాలకు బోనస్ ఇస్తమన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలకు నమ్మకం లేకుండ అయితుంది. బోనన్ డబ్బులు ఇప్పటి వరకు దిక్కులేవు. నాకున్న ఎకరన్నరలో సన్నరకం వేసిన. 40 క్వింటాళ్లు వస్తే రెండు నెలలకింద కొనుగోలు కేంద్రంలోనే అమ్మిన. 40 క్వింటాళ్లకు 20 వేల బోనస్ రావాల్సి ఉన్నది. ఇచ్చిన మాట ప్రకారం బోనస్ వెంటనే చెల్లించాలె.
– జక్కుల లక్ష్మి, రైతు (దమ్మన్నపేట)