కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల దందా నడుస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్య పోస్టులో ఉన్న ఓ అధికారి ఈ విషయంలో కీలకంగా ఉన్నట్టు తెలుస్తున్నది. వారధి సంస్థను ఏమార్చి మెరిట్‌తో సంబంధం లేకుండా తన కుటుంబ సభ్యులు ఇద్దరికి ఇప్పటికే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో నియమించుకున్నట్టు సమాచారం. కళాశాల ఏర్పాటు కాకముందు సీడ్ గోదాముల్లో పనిచేసే హమాలీలకు ఉద్యోగాలు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం చెప్పగా, తండ్రి స్థానంలో కొడుక్కు ఉద్యోగం ఇచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తున్నది. తిరిగి కొత్తగా వారధి ద్వారా 52 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా, ఇదే దందా కొనసాగినట్టు తెలిసి నియామకాలు నిలిపి వేసినట్టు తెలిసింది.
కరీంనగర్, మే 16 (నమస్తే తెలంగాణ)/ విద్యానగర్ : కరీంనగర్ మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట పెద్ద దందానే నడుస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కళాశాలలో కీలక పోస్టులో ఉన్న ఓ అధికారి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో వారధి సంస్థను కూడా తప్పుదారి పట్టించినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో తెలంగాణ విత్తనోత్పత్తికి సంబంధించిన గోదాములను రెనోవేషన్ చేసి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. అయితే, ఇక్కడ పని చేస్తున్న హమాలీలు తమకు ఉపాధి పోతుందని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి విన్నవించుకోగా మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ కింద ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇదే అదునుగా ఆ అధికారి దందాకు తెరలేపినట్లు తెలుస్తున్నది. తండ్రి స్థానంలో కొడుక్కు ఉద్యోగం ఇచ్చి 2 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా, గతంలో అవసరమైన పది మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లను ఔట్ సోర్సింగ్ కింద ఎంపిక చేసేందుకు కరీంనగర్ కలెక్టరేట్లోని వారధి ద్వారా నోటిఫికేషన్లు ఇచ్చారు. అందులో పది మందిని ఎంపిక చేయగా ఒకరికి ప్రభుత్వోద్యోగం రావడంతో రాజీనామా చేసి వెళ్లారు. మరొకరు ఆ సమయంలో టెట్ నోటిఫికేషన్ రావడంతో చదువుకోవాలనే ఉద్దేశంలో ఆమె కూడా మానేసింది. వారధిలో నమోదైన సీనియార్టీ, మెరిట్ ఆధారంగా మెడికల్ కళాశాలకు అవసరమైన పది మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లలో ఎనిమిది మందిని మాత్రమే నియమించారు. ఆ తర్వాత సీనియార్టీని పక్కన పెట్టి, మెరిట్‌తో సంబంధం లేకుండా ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారు. ఈ ఇద్దరు మెడికల్ కళాశాలలో కీ పోస్టులో ఉన్న అధికారి కుటుంబ సభ్యులేనని తెలుస్తున్నది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు వారధి నుంచి తీసుకున్నప్పుడు సదరు సంస్థలో రిజిస్టర్ అయి ఉన్న సీనియార్టీ ప్రకారం, మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ, ఈ రెండు ఉద్యోగాల్లో వారధి నిబంధనలు గాలికి వదిలేసి తన కుటుంబ సభ్యులను నియమించుకున్నారని సదరు అధికారిపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
మెడికల్ కళాశాలలో పని చేస్తున్న అధికారి ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలకు పాల్పడిన విషయాన్ని ఇదే కళాశాలలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాగానే వారధిలో నమోదైన నిరుద్యోగుల నుంచి 400లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో పది మందిని ఎంపిక చేయగా ఇద్దరు మానుకున్నారు. వారి స్థానంలో మెరిట్ ప్రకారంగా తర్వాతి స్థానాల్లో ఉన్న వారిని నియమించాల్సి ఉంటుంది. కానీ, అందుకు భిన్నంగా ఎలాంటి మెరిట్ లేకున్నా సదరు అధికారి తన కుటుంబ సభ్యులు ఇద్దరి ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగాలు ఇప్పించుకున్నాడని కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నెలకు 1.50 లక్షల వేతనం తీసుకుంటున్న ఈ అధికారి కుటుంబానికి చెందిన వారికే ఉద్యోగాలు ఇవ్వడం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మెడికల్ కళాశాల నిర్వహణ కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విరివిగా అవసరం ఉంటారు. మొదట నియమించిన పది మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లే కాకుండా గతేడాది అక్టోబర్‌లో మరో 52 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేశారు. అందులో ల్యాబ్ అటెండెన్స్15, స్టోర్ కీపర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు 7, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్స్ 8, అనస్తీషియా టెక్నీషియన్స్ 4, దోబీ 4, ఎలక్ట్రీషియన్స్ 2, ప్లంబర్ 1, డ్రైవర్ 1, థియేటర్ అసిస్టెంట్లు 4, గ్యాస్ ఆపరేటర్లు 2, వార్డు బాయిస్ 4 పోస్టులు ఔట్ సోర్సింగ్ కింద భర్తీ చేయాలి. ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నియామకాలు చేపట్ట లేదు. అయితే, ఈ విషయంలో కూడా సదరు అధికారి జోక్యం చేసుకోవడంతో పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నట్లు, డబ్బులు చేతులు మారుతున్నట్లు తెలియడంతో నియామకాలు నిలిపివేసినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తిష్ట వేసిన ఈ ఉన్నతాధికారి కనుసన్నల్లోనే ఈ దందా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మెడికల్ కళాశాల ఉన్నతాధికారులను, డీఎంఈ అధికారులను కూడా ఈ అధికారి తప్పుడు సమాచారం ఇస్తూ ఏమార్చుతున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపితే అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.