కరీంనగర్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేయడంపై కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఓ టీవీ స్టుడియో ఇంటర్వ్యూకు హాజరై బయటకు వచ్చిన ఆయనను నడిరోడ్డుపై అదుపులోకి తీసుకోవడంపై గులాబీ దళం భగ్గుమన్నది. బీఆర్ఎస్ నాయకులు ఆయన అరెస్ట్‌ను ఖండిస్తూనే ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఇదొక పిరికిపంద చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ పక్కలో బల్లెంలా మారిన ఆయన గొంతును ఏదో రకంగా నొక్కాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్లో గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను వేదిక వద్ద నిలదీసిందుకు.. ఆయనపై కక్షకట్టిన కాంగ్రెస్ మంత్రుల ఆదేశాల మేరకే అరెస్ట్ చేశారని విమర్శిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని నిలదీస్తే కేసులు నమోదు చేస్తారా..? అని మండిపడ్డారు. అయినా ప్రశ్నించే గొంతులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నదని, ప్రజల వైపు నిలబడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నదని, అరెస్టులతో భయపెడుతున్నదని ధ్వజమెత్తారు.
కొనసాగిన హైడ్రామా
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రిమాండ్ వ్యవహారంలో అంతా హైడ్రామా కొనసాగింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు, రాత్రి 9.30 గంటల సమయంలో కరీంనగర్ తీసుకొచ్చారు. నేరుగా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. తర్వాత వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువస్తారన్న సమాచారంతో అక్కడికి నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. మరోవైపు కౌశిక్‌రెడ్డి కేసులపై వాదనలు వినిపించేందుకు మాజీ మేయర్ రవీందర్‌సింగ్, నారదాసు లక్ష్మణ్‌రావు వచ్చారు. కానీ, అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలో కౌశిక్‌రెడ్డిని త్రీటౌన్‌కు తరలించారు. నేటి ఉదయం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.