కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టుగానే సీజన్ ప్రారంభానికి ముందే రైతుభరోసా ఇవ్వాల్సిందేనని రైతులు తేల్చిచెప్పారు. పంటలు వేసి, కోతకు వచ్చే దశలో ఇస్తే ఏం ప్రయోజనమని, సకాలంలో అందితేనే ఫలితం ఉంటుందని తెలిపారు. పెట్టుబడి సాయానికి షరతులు పెట్టవద్దని, రేషన్, ఐటీ వంటి నిబంధనలు మినహాయించాలని స్పష్టం చేశారు. ఒక్కో రైతు ఎంత సాగు చేస్తే అంత భూమికి ఇవ్వాలని, అవసరమైతే అధికారులతో క్షేత్రస్థాయిలో సర్వే చేయించాలని సూచించారు. మంగళవారం రైతు భరోసా పథకంపై మార్గదర్శకాలు ఏ విధంగా అమలు చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందనే ఆంశంపై రైతుల అభిప్రాయాలు సేకరించడంతోపాటు వారి సూచనలు, సలహాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒకచోట నిర్వహించిన ఈ వీసీలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నతాధికారులు పాల్గొని రైతుల అభిప్రాయాలు తెలుసుకోగా, పలువురు పై విధంగా స్పందించారు.
-హుజూరాబాద్/ తిమ్మాపూర్/ గంగాధర, జూన్ 25
రైతులకు ఎలాంటి నిబంధనలు, ఆంక్షలు లేకుండా రైతు భరోసా సాయం అందించాలి. ఏక కాలంలో 2 లక్షల రుణ మాఫీ చేయాలి. రైతు భరోసాకు రేషన్‌కార్డు, ఐటీ పేయర్ అని చూడద్దు. భూమిలో సాగు చేస్తే రైతుకు ఎలాంటి నిబంధనలు లేకుండా ఇవ్వాలి. అలాగే, రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, బిందు, తుంపర సేద్యం పరికరాలు అందించాలి.
-వీరబత్తిని సత్యనారాయణ, రాపల్లి (గొల్లపల్లి మండలం)
రైతు భరోసా పథకాన్ని పదెకరాల వరకు ఉన్న రైతులకు ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. నిజమైన ప్రతి ఒక్క రైతుకు భరోసా అందజేయాలి. పంటల సాగుకు ముందు పెట్టుబడికి ఉపయోగపడేలా ఎకరానికి 7500 రైతు ఖాతాలో జమ చేయాలి. అలాగే, రైతులందరూ గృహావసరాలు, ఇతర లోన్ల కోసం ఐటీలు కడుతున్నరు. అలాంటప్పుడు ఐటీ కట్టే వారికి రైతు భరోసా ఇవ్వకపోతే చాలా నష్టపోతరు. ఐటీతో సంబంధం లేకుండా, ఎలాంటి కండీషన్లు లేకుండా రైతుభరోసా అందజేయాలి.
– మోరపల్లి రమణారెడ్డి, రైతు, మొగిలిపాలెం (తిమ్మాపూర్ మండలం)
ఇప్పుడు ఎవుసం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. 40 ఏళ్లు పైబడిన వారే వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నరు. యువకులు నగరీకరణ, ఉద్యోగాల వైపే వెళ్తున్నరు. రైతు భరోసా అమలులో ప్రభుత్వం ఏ రీతిన ఆలోచిస్తుందో తెలువదు. కానీ, సాగు చేసిన వ్యవసాయ భూమికి పరిమితి లేకుండా రైతుభరోసా అందజేయాలి. కౌలు రైతులకు నేరుగా అందిస్తామంటే క్షేత్రస్థాయిలో యజమానులు తమ భూములను పడావు ఉంచుకుంటారే తప్ప కౌలుకు ఇవ్వరు. తద్వారా కౌలు రైతుల జీవన విధానంపై ప్రభావం పడుతుంది. అంతెందుకు నేనే ఒక పదెకరాలు మల్యాల మండలం పోతారంలో కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న. ఒక వేళ కౌలు రైతుల గురించి ఆలోచించి ప్రభుత్వం తరఫున అందజేసే పెట్టుబడి సాయాన్ని భూ యజమానికి సగం, కౌలు రైతులకు సగం ఇస్తే కొంత మేర ఇద్దరికీ న్యాయం జరుగుతుంది. ఒక్కో రైతు ఈ రోజుల్లో 20 ఎకరాలు సైతం సాగు చేసే అవకాశమున్నది. ఐదెకరాలు సాగు చేస్తే రైతులకు ఏం మిగులుది? దాంట్లో పిల్లల్ని ఏం పెట్టి చదివిస్తం? పరిమితి లేకుండా ఎంత సాగు చేస్తే అంత పెట్టుబడి సహాయం అందజేయాలె. అవసరమైతే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి సాగు వివరాలు పక్కాగా సేకరించాలి. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే సస్పెండ్ చేయాలి. రైతుభరోసా, రుణమాఫీ వంటి పథకాలకు రేషన్‌కార్డు, ఐటీ రిటర్న్ అనే మెలిక పెట్టడం సరికాదు. ఈ నిబంధనను ఉపసంహరించుకోండి.
– తుంగతుర్తి రామారావు, పోతారం (మల్యాల మండలం)
గత ప్రభుత్వం రైతుబంధు పేరిట ఎకరానికి ఏటా 10 వేలు ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా పేరిట ఎకరానికి 15 వేలు ఇస్తామని ఎన్నికల సమయంల హామీ ఇచ్చింది. ఈ పథకాన్ని అందరికీ కాకుండా కొందరికి మాత్రమే ఇస్తామని చెప్పడం అన్యాయం. ఇచ్చేదేదో సాగుకు ముందు ఇస్తే మంచిది.
– నరహరి నారాయణరెడ్డి, రైతు (ఎలిగేడు మండలం)
రైతులు రెకలు ముకలు చేసుకొని ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తరు. అలాంటి రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు కండీషన్లు పెట్టద్దు. కారు ఉన్నదనో.. ఇల్లు ఉన్నదనో.. రేషన్ కార్డు లేదనో.. ఐటీ కడుతున్నాడనో.. ఇలాంటి సాకులు చూప ద్దు. భూమి ఉన్న రైతులకు రైతు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎన్నికలప్పుడు రైతులందరికీ రైతు భరోసా కల్పిస్తామని చెప్పి ఇప్పుడు షరతులు పెట్టడం సరికాదు.
– ఒడ్నాల సతీశ్, రైతు, నాగారం (కమాన్‌పూర్ మండలం)
రైతు భరోసా అందించడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. ఇది కరెక్ట్ కాదు. సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తామని, దొడ్డు వడ్లకు ఇవ్వమని ప్రకటించడం అన్యాయం. నేల రకం, నీటి వసతి, పెట్టుబడి, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని రైతులు పంట సాగు చేస్తరు. కాబట్టి అన్ని రకాల వడ్లకు బోసన్ ఇవ్వాలె. పదెకరాలలోపు ఉన్న రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలి. ఇప్పటికే సాగు ప్రారంభమైంది. పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నరు. ప్రకృతి, ప్రభుత్వం రెండూ రైతును పగబట్టినట్టు కన్పిస్తున్నది. వర్షాలు లేక, పెట్టుబడి సాయం అందక అన్నదాతలు అయోమయంలో ఉన్నరు.
– పాల తిరుపతిరావు, రైతు, నిట్టూరు, పెద్దపల్లి
ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినట్టుగానే సీజన్ ప్రారంభంలోనే రైతు భరోసా ఇవ్వాలి. గతేడాది యాసంగి సీజన్ పైసలు పంటకోతల సమయంల జమైనయ్. ఈ సంవత్సరం ఇప్పటికే రైతులు వ్యవసాయపనులు ముమ్మరంగా చేస్తున్న రు. కానీ, ఇంకా రైతు భరోసా పడలేదు. అదునుకు పంటసాయం అందకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతరు.
– తిప్పని ప్రశాంత్ యువరైతు, కుక్కలగూడూర్ (పాలకుర్తి మండలం)
సీజన్‌కు ముందే రైతు భరోసా ఇవ్వాలి. పంటల సాగుకు ఏ ఇబ్బంది రాకుండా ముందే రైతుల ఖాతాల్లో జమ చేయాలి. గతంలో వానకాలం, యాసంగి పంటలు ప్రారంభం కాకముందే రైతుల అకౌంట్లలో రైతుబంధు డబ్బులు జమయ్యేవి. కానీ, పోయిన యాసంగిల పంటలు చివరి దశకు వచ్చినా పెట్టుబడి జమ కాక చాలా ఇబ్బంది పడ్డం. కాంగ్రెస్ ప్రభుత్వం పదెకరాల లోపు ఉన్న చిన్న, సన్న కారు రైతులందరికీ ఎలాంటి నిబంధనలు పెట్టకుండా రైతు భరోసాను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయాలి. భూమి ఉండి, పంటలు పండిస్తున్న రైతులందరినీ అర్హులుగా గుర్తించాలి. విత్తనాలు, ఎరువుల కొరతలు లేకుండా చర్యలు తీసుకోవాలి.
– కొలిపాక పోచాలు, రైతు, పెంచికల్పేట్ (కమాన్‌పూర్ మండలం)
రైతు భరోసాను పదెకరాల వరకు ఉన్న వారందరికీ వర్తింపజేయాలి. పంటలు సాగు చేయని భూములకు ఇవ్వకుండా పదెకరాల లోపు ఉన్నవారికి ఇస్తే మధ్య తరగతి రైతులకు మేలు జరుగుతది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రైతు రుణమాఫీని ఏక కాలంలో అమలు చేయాలి.
-కొక్కు గంగారాం, రైతు (సారంగాపూర్)
పంట పండించే రైతుకు ఆధార్ కార్డు లింకుతో పదెకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి. రేషన్ కార్డుతో లింకు పెట్టొద్దు. 500 బోనస్ ఒక్క సన్నరకాలకే కాకుండా దొడ్డురకాలకు కూడా అందించాలి. రైతు రుణమాఫీని ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలి. రైతులకు డ్రిప్ పరికరాలు అందించి ఆదుకోవాలి.
– ఎలాల వెంకట్‌రెడ్డి, రైతు (ఇబ్రహీంపట్నం మండలం)