Operation Kagar | కరీంనగర్, తెలంగాణ చౌక్, జూన్ 7 : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శనివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలువైన అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తుందని ఆరోపించారు.
మావోయిస్టు సమస్యను రాజకీయ కోణంలో పరిశీలించి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. గతంలో పలుమార్లు చర్చలకు సిద్ధమని మావోయిస్టులు లేఖల ద్వారా వెల్లడించినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజా సంఘాలు మేధావుల మధ్యవర్తిత్వంతో శాంతియుత మార్గం ద్వారా మావోయిస్టుల సమస్యను పరిష్కరించాలని వారు కోరారు . ఉగ్రవాద దేశంగా పాకిస్థాన్ ను పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం ఆ దేశంతో చర్చలు జరుపుతుందని కానీ భారతీయులైన మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపటం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ముకుంద రెడ్డి, ఎడ్ల రమేష్, నాగరాణి, సీపీఐ నాయకులు పైడిపల్లి రాజు, బుచ్చన్న యాదవ్, మల్లవ్వ, మంజుల తదితరులు పాల్గొన్నారు.