Godavarikhani | కోల్ సిటీ, డిసెంబర్ 20: గోదావరిఖని గణేష్ చౌక్ లో రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ చౌరస్తా రెండవ రోజూ కొనసాగింది. శనివారం నాడు ఒక ప్రక్క బాధితుల కన్నీళ్లు… హృదయ విదారకర రోదనలు… మరో ప్రక్క కళ్లెదుటే కట్టడాల కూల్చివేతలతో ఆ ప్రాంతం అట్టుడికింది. రెండేళ్ల క్రితం అధికారులు అనుమతి ఇస్తేనే ఇక్కడ దుకాణాలు నిర్మించుకున్నామనీ, అప్పుడే ఆక్షేపణలు ఎందుకు చెప్పలేదంటూ బాధితులు అదికారులను ప్రశ్నించారు. జేసీబీ సిబ్బందికి ఎదురువెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు.
గుండెలు బాధుకుంటూ తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ కుటుంబాలకు జీవనాధారమైన దుకాణాలే మీ అభివృద్ధికి అడ్డుగా ఉన్నాయా? మా కన్నీళ్లను దాటుకొంటూ మా పొట్ట కొట్టడమే మీకు ఆనందమా అంటూ రోదించారు. కేవలం ముందు భాగాలు మాత్రమే తొలగిస్తామని నోటీసులు ఇచ్చారనీ, తీరా చూస్తే పూర్తిగా దుకాణాలనే కొల్లగొడుతున్నారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రత్యమ్నాయంగా ఉపాధి మార్గం చూపకుండా రోడ్డున పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చేతుల్లో ఉన్న డబ్బులు చాలక అప్పులు చేసి జీవనోపాధి నిమిత్తం ఇక్కడ షాపు ఏర్పాటు చేసుకున్నామనీ, అనుమతి ఇచ్చింది వాళ్లే.. కూలగొట్టేది వాళ్లేనా..? అంటూ సిరిశెట్టి జయసుధ-మల్లేశ్ దంపతులు లబోదిబోమంటూ వేడుకున్నారు.
అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ సిబ్బంది ఎక్స్కవేటర్తో కట్టడాలను పూర్తిగా నేలమట్టం చేశారు. స్థానికులు గుమిగూడి బాధితులకు సానుభూతి తెలిపారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తా వెడల్పు, రోడ్ల సుందరీకరణలో భాగంగానే ప్రభుత్వంకు చెందిన స్థలాల్లో ఉన్న నిర్మాణాలను చట్ట ప్రకారమే తొలగిస్తున్నామని నగర పాలక టౌన్ ప్లానింగ్ అధికారులు పేర్కొంటున్నారు.
పొలం అమ్మి రెండేళ్ల క్రితమే కట్టుకున్నా : సిరిశెట్టి జయసుధ, బాధితురాలు
ఊళ్లో పొలం, నగలు అమ్మగా వచ్చిన డబ్బులతో ఇక్కడ షాపు కట్టుకున్న. అప్పుడు అధికారులు పర్మిషన్ ఇచ్చిర్రు. అప్పుడే అడ్డు చెప్తే వేరే చోట కట్టుకునేటోళ్లం కదా. రెండేళ్ల క్రితమే కట్టుకున్నం. షాపు వెనుకాల ముందు మాత్రమే తీస్తామని చెప్పిర్రు. ఇప్పుడే మొత్తం షాపే కూలగొట్టారు. రేపటి సంది ఎట్ల బతికేది. మా బతుకులను ఆగమాగం చేయడానికే వచ్చిర్రా…ఇంతసుతం కనికరం లేకుండా కూలగొట్టుమని ఎవరు చెప్పిర్రు. మేము రోడ్డుమీద పడితే వాళ్ళ కళ్ళు సల్లబడుతాయా.?