Godavari Khani | కోల్ సిటీ, డిసెంబర్ 19: గోదావరిఖని గణేష్ చౌక్ లో ఆపరేషన్ చౌరస్తా ఉద్రిక్తతకు దారి తీసింది. నగరం నడిబొడ్డున దూసుకొచ్చిన బుల్డోజర్ హడలెత్తించింది. కూల్చివేతలు ఆపాలంటూ బాధితులు లబోదిబోమంటూ జేసీబీకి అడ్డంగా బైకాయించడం ఆందోళనగా మారింది. అధికారులు, వ్యాపారుల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయిలో జరిగింది. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని టాక్సీ స్టాండ్ ప్రక్కన గల ప్రభుత్వ స్థలంలో చాలా కాలంగా ఉన్న దుకాణాలు అక్రమ నిర్మాణాల నెపంతో రామగుండం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు శుక్రవారం ఉదయం తొలగించేందుకు రంగంలోకి దిగారు.
ఎక్స్కవేటర్ తో నిర్మాణాలను కూల్చివేసేందుకు ఉపక్రమించగా వ్యాపారులు అడ్డుకున్నారు. ఇప్పటికప్పుడు కూల్చివేస్తే తమ జీవనోపాధి ఎట్ల అంటూ వాపోయారు. కాగా ఇది ప్రభుత్వ స్థలమని, ఇందులో నిర్మించుకున్న దుకాణాలు తొలగించుకోవాలని గతంలోనే నోటీసులు జారీ చేశామనీ, ఖాళీ చేయని కారణంగా తామే తొలగించాల్సి వస్తుందని టౌన్ ప్లానింగ్ అధికారులు స్పష్టం చేశారు. తమకు ప్రత్యమ్నాయం చూపకుండా ఉన్నపలంగా కూల్చివేస్తే రేపటి నుంచి తమ కుటుంబాలు వీధిన పడుతాయని బాధితులు ఆందోళన చేపట్టారు.
జేసీబీ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. తమ పొట్ట కొట్టవద్దంటూ కన్నీరు పెట్టుకున్నారు. అధికారులను కాళ్లావేళ్లా పడి బతిమిలాడుకున్నారు. పలువురు రాజకీయ పార్టీల నాయకులు సంఘటన స్థలంకు చేరుకొని బాధితులకు మద్దతుగా నిలిచి కూల్చివేతలను ఆపాలని అధికారులను డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. కూల్చివేతల చర్యలతో చౌరస్తాలో ఆందోళనకర వాతావరణం నెలకొంది.
ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చట్టరీత్యా నేరమనీ, ఎప్పటికైనా ఖాళీ చేయాల్సిందేనని మున్సిపల్ అధికారులు సముదాయించడంతో బాధితులు షాపుల్లోని సామగ్రిని బయటకు తీసుకవచ్చి ఖాళీ చేశారు. అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు యథావిధిగా కొనసాగాయి.