Huzurabad Hospital | హుజూరాబాద్ టౌన్, జూన్ 02: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూరాబాద్ లోని 30 పడకల దవాఖానను వంద పడకలకు అప్ గ్రేడ్ చేసి అందుకు తగినట్టుగా సాకర్యాలు కల్పించింది. గతంలో ఆరుగురు ప్రత్యేక స్త్రీ వైద్య నిపుణులు, ఇద్దరు ఎముకల వైద్యులు, ఒక జనరల్ ఫిజీషియన్, ఐదుగురు మత్తు వైద్యులు, నలుగురు పిల్లల వైద్యులు, ఒక చెవి, ముక్కు గొంతు డాక్టర్, ఒక దంత డాక్టర్, ఒక సర్జన్, ఒక ఆయూష్, ఇద్దరు రేడియాలజిస్టులు, ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యుల చొప్పున మొత్తం 26 మంది విధులు నిర్వర్తించేది. అయితే, కొన్ని నెలల కింద ఆరుగురు వైద్యులను బదిలీ చేసి వారిస్థానంలో ముగ్గురినే నియమించారు. ఇటీవల ఓ ఇద్దరు వైద్యులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మత్తు వైద్యులు ఇద్దరు, జనరల్ సర్జన్లు ఇద్దరు, ఎముకల విభాగంలో ఇద్దరు, చెవి ముక్కు గొంతు డాక్టర్, ఓ రేడియాలజిస్టు అవసరముండగా.. దంత విభాగంలో వైద్యులు ఉన్నా పరికరాలు లేకపోవడంతో రోగులకు వైద్య సేవలు దూరమవుతున్నాయి.
తగ్గిన ఓపీ, ఆపరేషన్లు
వైద్యులు లేకపోవడంతో ఓపీ, సర్జరీలు తగ్గాయి. గతంలో ఆరుగురు ప్రత్యేక స్త్రీల వైద్య నిపుణులు ఉండగా ప్రస్తుతం అయిదుగురు ఉన్నారు. అందులో ఒకరు సస్పెండ్ అవగా, ఇప్పుడు నలుగురే సేవలందిస్తున్నారు. అందులోనూ ఇద్దరు పర్మినెంట్ వైద్యులు ఉండగా, ఇద్దరు డిప్యూటేషన్‌పై ఇక్కడ సేవలందిస్తున్నారు. జనరల్ సివిల్ సర్జన్, ఆర్థోపెడిక్, ఈఎంటీ, వైద్యులు అందరూ బదిలీ అయ్యారు. వారి స్థానంలో ఎవరూ రాకపోవడంతో రోగులకు సేవలందక ప్రైవేటు దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. మత్తు వైద్యుడు ఒక్కరు మాత్రమే ఉన్నారు. కాగా, ఎక్స్‌రే, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లకు, నర్సులకు కొరతే ఉంది. ల్యాప్రోస్కిపిక్ పరికరాలు, సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలు సైతం అందుబాటులో లేవు. జిల్లా మంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి స్పందించి హుజూరాబాద్ ప్రాంతీయ దవ ఖానకు తగినంత వైద్యులను నియమించి రోగులకు వైద్యసేవలందించాలని కోరుతున్నారు.
సకాలంలో వైద్యం అందిస్తాం : డాక్టర్ నల్లా నారాయణ రెడ్డి, సూపరింటెండెంట్
13
రోగులకు సకాలంలో వైద్యం అందిస్తాం. సిబ్బంది రోగులను ఇబ్బందులకు గురిచేస్తే నా దృష్టికి తీసుకువస్తే తప్పక సిబ్బందిపై చర్యలు తీసుకుంటా. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సాయశక్తులా కృషి చేస్తా.