Vemulawada | వేములవాడ, జూలై 12 : రాష్ట్ర దేవాదాయ శాఖ రెండేళ్ల క్రితం ఉద్యోగులను బదిలీ చేపట్టగా వేములవాడ రాజన్న ఆలయం నుండి 28 మంది ఉద్యోగులకు బదిలీ అయింది. ఇందులో ప్రధానంగా వేములవాడ, యాదగిరిగుట్ట, కొండగట్టు, భద్రాచలం, బాసర, కొమరవెల్లి ఆలయాలతో కలిపి ఆరు దేవాలయాలుగా యూనిట్ గా పేర్కొంటూ ఆగస్టు 2024లో బదిలీ జరిపిన విషయం తెలిసింది. ఇందులో వేములవాడ రాజన్న ఆలయం నుండి యాదగిరిగుట్టకు 14 మంది, కొండగట్టు 8, బాసర 3, భద్రాచలం 2, కొమరవెల్లికి ఒకరు చొప్పున మొత్తం ఎనిమిది 28 మందికి బదిలీ జరిగింది. ఇప్పటికే ఇందులో యాదగిరిగుట్టకు బదిలీ అయినా హరికిషన్, నటరాజ్, రామేశ్వరర్ రావు, కొమరవెల్లికి బదిలీ అయిన శ్రీరాములు, కొండగట్టుకు బదిలీ అయిన నాంపల్లి లు విరమణ పొందారు.
ఇక యాదగిరిగుట్ట నుండి డీఈవో నవీన్, బాసర నుండి ఏఈఓ లక్ష్మణ్ రావు కూడా ఇటీవలే రాజన్న ఆలయానికి బదిలీ అయ్యారు. ఇటీవలే యాదగిరిగుట్టను స్వయం ప్రతిపత్తి దేవాలయంగా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో అక్కడి మాతృ సంస్థలో నియమితులైన ఉద్యోగులను వెనక్కి తీసుకుంటుండగా వేములవాడ నుండి బదిలీ అయిన 11 మంది ఉద్యోగులను ఇప్పటికే రిలీవ్ చేయగా, వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన 17 మంది యాదగిరిగుట్ట ఉద్యోగులు ఆదివారం రిలీవ్ అయ్యారు.
ఇక మొత్తం మీద రెండు సంవత్సరాల క్రిందట జరిగిన బదిలీలలో భాగంగా ఇక వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన ఉద్యోగులు కొండగట్టు 7, బాసర 2, భద్రాచలంలో మిగిలి ఉన్నారు. అయితే సదరు ఉద్యోగులు కూడా తమకు కూడా మాతృ సంస్థకు తిరిగి వచ్చేందుకు అవకాశం కల్పించాలని ఇప్పటికే వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వేములవాడలో విధులు నిర్వహిస్తున్న కొండగట్టు ఉద్యోగులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసి విన్నవించారు.
ఇక మిగిలింది వీరే…
వేములవాడ రాజన్న ఆలయం నుండి బదిలీ అయిన ఉద్యోగులు తమకు కూడా మాతృ సంస్థలో విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేలను కలిసి విన్నవించారు. అయితే కొండగట్టులో ఏఈఓ 1, పర్యవేక్షకులు 2, సీనియర్ అసిస్టెంట్లు 3, జూనియర్ అసిస్టెంట్ ఒకరు ఉన్నారు. బాసరలో సీనియర్ అసిస్టెంట్ 1, జూనియర్ అసిస్టెంట్ ఒకరు ఉన్నారు. భద్రాచలంలో ఒక రికార్డ్ అసిస్టెంట్ తో కలిపి మొత్తం పదిమంది ప్రస్తుతం రాజన్న ఆలయ ఉద్యోగులు ఇతర ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. దాదాపుగా రెండేళ్ల పాటు ఇతర ఆలయాల్లో పనిచేసినందున తమకు కూడా మాతృ సంస్థలో పనిచేసేందుకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.
పరిపాలనలో ఏర్పడనున్న లోటు..!
రాజన్న ఆలయంలో విధులు నిర్వహించే యాదగిరిగుట్ట ఉద్యోగులు ప్రస్తుతం మాతృ సంస్థకు వెళుతున్న క్రమంలో వేములవాడ రాజన్న ఆలయంలో పరిపాలనపరమైన లోటు ఏర్పడే అవకాశం ఉంది. వేములవాడ రాజన్న ఆలయానికి యాదగిరిగుట్ట నుండి మొత్తం 21 మంది ఉద్యోగులు గత రెండేళ్ల క్రితం బదిలీపై వచ్చారు. ఇందులో ఇప్పటికే నలుగురు ఉద్యోగులు డిప్యూటేషన్ పై వెళ్లగా మిగిలిన 17 మంది ఆదివారం రిలీవ్ అయ్యారు. అయితే రాజన్న ఆలయానికి మాత్రం 11 మంది ఉద్యోగులు మాత్రమే తిరిగి యాదగిరిగుట్ట నుండి రానున్నారు. ఇందులో ప్రధానంగా ఇంజనీరింగ్ విభాగం, ఇతర పరిపాలన కార్యాలయాల్లో ఉద్యోగుల లోటు ఏర్పడను ఉండగా పరిపాలనలో లోటు ఏర్పడే అవకాశం ఉందని కార్యాలయ వర్గాలు ఇప్పటికే అంచనాకు వచ్చాయి. ఇతర ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను వెనక్కి తీసుకుంటే రాజన్న ఆలయ పరిపాలన యధావిధిగా నడిచే అవకాశం ఉంటుందని అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.