వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్ల రీ ఓపెన్‌కు మరికొద్దిరోజులే మిగిలాయి. అయితే బడులు తెరుచుకునేనాటికి పిల్లలకు యూనిఫామ్స్ అందేనా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అందిస్తామని విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
మహిళా సంఘాలకు బాధ్యతలు ఇచ్చినప్పటికీ, క్లాత్‌ను పదిహేను రోజుల క్రితమే పంపిణీ చేయడం, తయారీ మొదలు పెట్టడం ఇబ్బందిగా మారింది. ఇంకా బట్ట కత్తిరింపు మిషన్లతోపాటు మగపిల్లలకు షర్ట్, ప్యాంట్, నెక్కర్లు కుట్టే దర్జీల కొరత వేధిస్తున్నది. మరోవైపు నైపుణ్యం ఉన్న తయారీదారులు లేక ఇబ్బందులు ఎదురవుతుండగా, గడువులోగా ఒక్కో విద్యార్థికి రెండు జతలు అందుతాయన్న నమ్మకం లేదని ఉపాధ్యాయవర్గాల్లో వినిపిస్తున్నది.
జగిత్యాల, జూన్ 5 (నమస్తే తెలంగాణ): విద్యా సంవత్సరం ఆరంభం నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల దుస్తులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ప్రతి విద్యా సంవత్సరం చివరలో పిల్లల సంఖ్యను లెక్కించి వారికి అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్‌కు ఏర్పాట్లు మొదలు పెడతారు. జగిత్యాల జిల్లాలో 510 ప్రాథమిక, 83 ప్రాథమికోన్నత, 187 ఉన్నత పాఠశాల తోపాటు రెండు గురుకులాలు, 14 కస్తూర్భాలు, 13 మోడల్ స్కూ ల్స్, రెండు ఏయిడెడ్ సూల్స్, 5 గిరిజన సంక్షేమ పాఠశాలలు నడుస్తు న్నాయి. మొత్తం 831 పాఠశాలల్లోని 74,164 మంది విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.
జిల్లా వ్యాప్తంగా దాదాపు 75 వేల మంది విద్యార్థులకు 1.61 లక్షల యూనిఫామ్స్ తయారీ బాధ్యతను ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలకు ఇవ్వగా, వారు మండల సమైక్యలకు అందజేశారు. ము న్సిపాలిటీల పరిధిలో మాత్రం సెర్ప్ కమిటీలకు ఇచ్చారు. మొత్తం 41 కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేయగా, అందులో 1,040 మంది డ్రెస్ మేకర్స్ పనిచేస్తున్నారు. ఒక్కో యూనిఫామ్ తయారీకి ప్రభు త్వం 50 చొప్పున నిధులు కూడా మంజూరు చేసింది. అయితే ఈ యేడాది మార్చి, ఏప్రిల్ లోనే మహిళా సమైఖ్య సంఘాల సభ్యులు పాఠశాలలకు వెళ్లి పిల్లల కొలతలు తీసుకున్నప్పటికీ, అందుకు సం బంధించిన క్లాత్‌ను మాత్రం చాలా ఆలస్యంగా గత నెల 21న జిల్లాకు పంపించింది. 22, 23 తేదీల్లో దుస్తుల తయారీ ప్రారంభమైంది.
యూనిఫామ్స్ తయారీకి విద్యాశాఖ, డీఆర్డీఏలు కార్యాచరణను రూపొందించినా సకాలంలో బడి పిల్లలకు అందుతాయా..? అన్న విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యునిఫామ్స్ తయారీలో అన్నీ సమస్యలే ఉన్నాయని ఉపాధ్యాయులు, విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. గతేడాది తీసుకున్న కొలతలతో దుస్తులు తయారు చేయడం సరికాదని అంటున్నారు. బడి మరో పదిపన్నెండు రోజుల్లో ప్రారంభమవుతుందన్న టైంలో దుస్తుల తయారీ క్లాత్‌ను పంపిణీ చేయడం మరో పెద్ద సమస్యగా మారిపోయింది.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా డ్రెస్ డిజైన్స్, వాటి మేకర్స్ కొరత వేధిస్తున్నది. ప్రస్తుతం గురిచిన 1040 మంది మేకర్స్, తమ ఇండ్లలో ఆడవాళ్లకు సంబంధించిన జాకెట్లు, ఇతర డ్రెస్‌లు కుట్టేవారే. వారికి యూనిఫామ్స్ ముఖ్యంగా మూడో తరగతి లోపు పిల్లలకు సంబంధించిన స్లీవ్‌లెస్ స్కర్ట్, ఇన్సైడ్ షర్ట్ కుట్టడం పెద్ద సమస్య అని మేకర్సే పేర్కొంటున్నారు. ఇక 8 నుంచి 12వ తరగతి దాకా కిషోర బాలికలకు సంబంధించిన డిజైన్ డ్రెస్ కుట్టడం, దానిపై జాకెట్ మాదిరి టాప్ తయారు చేయడం సరిగా రావడం లేదంటున్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా మగ పిల్లలకు సంబంధించిన షర్ట్, నెక్కర్, ప్యాంట్ కుట్టడం పెద్ద సమస్యగా మారిపోయిందని వాపోతున్నారు.
బయట దర్జీలతో మగ పిల్లలకు సంబంధించిన షర్ట్, ప్యాంట్ కుట్టిద్దామని అనుకున్నా, అది వీలు కాని పరిస్థితి ఉందని, వాళ్లు ఒక డ్రెస్‌కు 600 నుంచి 700 వరకు వసూలు చేస్తున్నారని, 50కి ఒక డ్రెస్ కుట్టే పరిస్థితి లేదంటున్నారు. ఇంకా యూనిఫామ్ కొలతలకు అనుగుణంగా బట్టను కట్ చేసేందుకు ప్రత్యేకమైన మిషన్లు ఉంటాయని, అవి జిల్లాలో రెండు మాత్రమే ఉన్నాయని మేకర్స్ వాపోతున్నారు. రెండు మిషన్లతో కొలతలకు అనుగుణంగా బట్టలు కత్తిరించడం ఆలస్యం అవుతుందని, మేకింగ్‌లో ఇది ప్రధాన సమస్య అని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలు తెరుచుకునేనాటికి దుస్తులు అందించడం సాధ్యమయ్యేనా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తయారయ్యే యునిఫామ్స్ ఎంత నాణ్యంగా కుడుతారు..? అవి పిల్లలకు శోభాయమానంగా ఉంటాయా..? లేదా అన్నది మరో ప్రశ్న అని పులువురు టీచర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
యూనిఫామ్స్ తయారీపై పూర్తిస్థాయి దృష్టి సారించాం. మహిళా సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో తయారవుతున్నాయి. వెయ్యి మందికి పైగా మేకర్స్ రోజు పనిచేస్తున్నారు. బట్ట కత్తిరింపులకు సంబంధించి మిషన్ల కొరత ఉన్న విషయం వాస్తవమే. దానిని అధిగమించే మార్గాలు అన్వేషిస్తున్నాం. సకాలంలో పిల్లలకు రెండు జతల దుస్తులు అందజేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం.
– చరణ్‌రాజ్, డీఆర్డీఏ అధికారి (జగిత్యాల)