ONLINE | గంగాధర,ఏప్రిల్ 12: గంగాధర తహసీల్దార్ కార్యాలయంలో కులం, ఆదాయం సర్టిఫికెట్లు జారీ చేసే సర్వర్ మొరాయించడంతో కార్యాలయానికి వచ్చిన వారు ఇబ్బందులకు గురయ్యారు. రాజీవ్ యువ వికాసం కింద నిరుద్యోగులకు సబ్సిడీ లోన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో సబ్సిడీ లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన కులం ఆదాయం సర్టిఫికెట్ల కోసం నిరుద్యోగులు వేలాదిగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు.
దీంతో వేలాదిగా దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయానికి రావడంతో సర్వర్ మొరాయించింది. వందల సంఖ్యలో అప్లికేషన్లు కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయి. ఈనెల 14న సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు కావడంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున కులం ఆదాయం సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నారు.
సర్వర్ మొరాయించడంతో ఇబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆన్లైన్ సర్వర్ సరిగా పనిచేయడం లేదని, పని చేసిన సమయంలో వీలైన ఎక్కువ మొత్తంలో సర్టిఫికెట్లను జారీ చేస్తున్నట్లు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.