కలెక్టరేట్, ఫిబ్రవరి 04 : ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు సెలవుల మంజూరుకు ఇకనుంచి ఆన్లైన్లో ధరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. పారదర్శకంగా సెలవులు మంజూరు చేసే క్రమంలో కరీంనగర్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక పోర్టల్‌కు రూపకల్పన చేసింది. టీం ఇండియా సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాగితం పని తగ్గించే క్రమంలో సెలవు మంజూరులో పారదర్శకతను పాటించేందుకు ఈ పోర్టల్ రూపొందించినట్లు వెల్లడించారు. సెలవుకోసం దరఖాస్తు చేసుకునేవారు ఈ పోర్టల్‌లో తమ వివరాలు పొందుపరిస్తే.. జిల్లా యంత్రాంగం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో టీమ్లప్ సంస్థ కో ఫౌండర్ రంజిత్ రెడ్డి, టీం ఇండియా సంస్థ సీఈవో చైతన్య, లక్ష్మిప్రసన్న, అనిల్ శర్మతో పాటు పలువురు పాల్గొన్నారు.