కాలుష్యాన్ని నివారించడంతో పాటు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం పదో విడుత కోసం అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. జూన్ 15 అనంతరం దీనిని చేపట్టే అవకాశం ఉండగా, ఇందుకోసం అవసరమైన మొక్కలను ఇప్పటికే గ్రామాల్లోని నర్సరీల్లో సిద్ధం చేయిస్తున్నది. ఇందులో నీడనిచ్చే, పండ్ల మొక్కలు ఉండగా, వాటి సంరక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది.
-కలెక్టరేట్, మే 19
జిల్లా వ్యాప్తంగా 313 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి, మొక్కలు పెంచుతున్నారు. 16లక్షల71వేల మొక్కలు కొత్తగా సిద్ధం కాగా, గతేడాది మొక్కలు 16లక్షల 70వేల వరకు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా 33.41లక్షల మొక్కలు సిద్ధంగా ఉండగా, 42.80లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్దేశించారు. అయితే, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో లక్ష్యాన్ని 26లక్షలకు కుదించాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. నేడో, రేపో కుదించిన లక్ష్యానికనుగుణంగా హరితహారం నిర్వహించేందుకు అనువుగా ఏర్పాట్లు చేయాలనే ఉత్తర్వులు కూడా రానున్నట్లు తెలుస్తున్నది.
22 రాష్ట్ర ప్రభుత్వ శాఖల ద్వారా ఈసారి హరితహారం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. అందుకనుగుణంగా ఆయా శాఖలకు లక్ష్యాన్ని కూడా నిర్దేశిస్తూ, ఉన్నతాధికారుల అమోదానికి నివేదికలు పంపినట్లు తెలుస్తున్నది. ఇందులో ప్రధానంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ 10.20లక్షలు, పంచాయతీరాజ్ శాఖ 1.50లక్షలు, ఆర్డబ్ల్యూఎస్ 25వేలు, వ్యవసాయశాఖ లక్ష, పోలీస్ శాఖ 10వేలు, విద్యాశాఖ 25వేలు, దేవాదాయశాఖ 20వేలు, ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ లక్ష, భూగర్భ గనుల శాఖ 50వేలు, విద్యుత్ శాఖ 25వేలు, రహదారులు భవనాల శాఖ 50వేలు, ఉద్యానవన శాఖ లక్ష, ఎస్ఆర్ఎస్పీ కెనాల్స్, ఇరిగేషన్ ట్యాంక్ బండ్ వద్ద 1.50లక్షలు, పట్టుపరిశ్రమ శాఖ లక్ష, కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 3.5లక్షలు, జమ్మికుంట మున్సిపాలిటీ లక్ష, కొత్తపల్లి మున్సిపాల్టీ 40వేలు, చొప్పదండి మున్సిపాల్టీ 50వేలు, అటవీశాఖ లక్ష మొక్కలు నాటి, సంరక్షించేలా లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ప్రతిపాదనలు పంపారు.
అన్ని ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో తొమ్మిది విడుతల్లో జిల్లావ్యాప్తంగా 4.2కోట్ల మొక్కలు నాటారు. వాడిపోయిన వాటి స్థానంలో తిరిగి కొత్తవి నాటి సంరక్షిస్తున్నారు. రహదారులకు ఇరువైపులా, కాల్వల ఒడ్డున, చెరువు గట్లు, కుంట కట్టలు, ప్రభుత్వ భూములు, కార్యాలయాల ఆవరణలో మొక్కలు నాటారు. వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిత్యం వాటికి నీళ్లు పట్టేందుకు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు ట్యాంకర్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం సమకూర్చింది. ఫలితంగా నేడు అవి ఏపుగా పెరిగి గ్రామాలు, పట్టణాలకు పచ్చదనాన్ని పంచుతూ, వాయు కాలుష్యాన్ని తగ్గిస్తున్నాయి. దీంతో, కేసీఆర్ ప్రభుత్వ స్ఫూర్తితో ఈసారి కూడా హరితహారం కార్యక్రమం ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.
ఈసారి ప్రత్యేకంగా ఎవెన్యూ, కమ్యూనిటీ, ఫార్మల్ ప్లాంటేషన్‌పై దృష్టి సారించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. భిన్న వాతావరణం నెలకొనడం, ఇప్పటికే ప్రభుత్వ భూముల్లో మొక్కలు పెంచుతుండడం మూలంగా వర్షాధారంగా మొక్కల పెంపకానికి తాత్కాలిక బ్రేక్ వేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నెలాఖరు నుంచి అంచనాలు రూపొందించనున్నట్లు తెలుస్తున్నది. గతంలో మాదిరి ఇష్టారాజ్యంగా మొక్కలు నాటకుండా పరిసరాలను బట్టి మొక్కలు నాటేందుకు ప్రత్యేక కార్యాచరణను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందిస్తున్నది. ప్రధానంగా రహదారులు, విద్యుత్ లైన్ల కింద ఏపుగా ఎదిగే వాటికి బదులు రెయిన్ ట్రీస్, కానుగ, పండ్ల మొక్కలు, గుబురు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికార యంత్రాంగం స్పష్టం చేస్తున్నది. అలాగే, నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలను ఎప్పటికప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సందర్శిస్తూ, చీడ, పీడల బారి నుంచి కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా నర్సరీల నిర్వాహకులకు సూచనలు చేస్తున్నారు.
వాతావరణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించి, పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం పెంపొందించేందుకే హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నం. తొమ్మిది విడుతల్లో డీఆర్డీవో ఆధ్వర్యంలో 2.5కోట్ల వరకు మొక్కలు నాటి సంరక్షిస్తున్నం. జిల్లాలో ఏడెనిమిదేళ్ల క్రితం నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి, బాటసారులకు నిలువ నీడనివ్వడంతో పాటు, కాలుష్యాన్ని కూడా తగ్గిస్తున్నాయి. హరితహారం ప్రారంభమైన అనంతరం అడవుల శాతం కూడా పెరిగింది. అటవీశాతం పెరుగుతున్న కొద్దీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను ఆగ్రామంలోనే నాటేలా ప్రణాళికలు రూపొందించి, పక్కాగా అమలు చేస్తున్నం. నాటిన మొక్కలను మూడేళ్ల వరకు సంరక్షిస్తున్నం.
-శ్రీధర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి