ఒకే కాంపౌండ్‌లో రెండు ప్రభుత్వ బడులు.. మొత్తం 139 మంది పిల్లలు.. ఉన్నది ఒకే మూత్రశాల.. ఇక విరామ సమయం వచ్చిదంటే చాలు వాష్‌రూం కోసం విద్యార్థులు చాంతాడంత లైన్లో నిల్చుండాల్సిందే. ఒకరి తర్వాత ఒకరు అంటే దాదాపు గంటకుపైనే నిరీక్షించాల్సిన హీనస్థితిలో జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ స్కూల్ మగ్గుతున్నది. ప్రభుత్వ పాలనకు, అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఆడపిల్లల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారు కాగా, బడికి రాలేమని, వసతులు వెంటనే కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. కాగా, విద్యార్థుల అవస్థలపై ఇటీవల పలు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలను చూసి ఎమ్మెల్సీ కవిత చలించిపోగా, ఆమె సూచన మేరకు బుధవారం జడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత స్కూల్‌ను సందర్శించారు. స్టూడెంట్స్ బాధలు కండ్లారా చూసి తన ఆవేదనను వెలిబుచ్చి, పిల్లలకు ధైర్యం చెప్పారు.
జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 25: జాబితాపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలలను ఒకేచోట నిర్వహిస్తున్నారు. హైస్కూల్లో 77 మంది, ప్రాథమిక పాఠశాలలో 62 మంది మొత్తం 139 మంది విద్యనభ్యసిస్తున్నారు. అందులో 77 మంది బాలురు, 62 మంది బాలికలు ఉన్నారు. హైస్కూల్లో 36 మంది బాలికలు ఉన్నారు. ఈ రెండు పాఠశాలలకు కలిపి ఒకే ఒక మూత్రశాల ఉండడంతో విద్యార్థులు మరీ ముఖ్యంగా బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో నిర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకోగా వాటిని కూల్చివేయడంతో ఉన్నత పాఠశాలలో ఉన్న ఈ ఒక్క మూత్రశాలే దిక్కయ్యింది. విరామ సమయంలో మూత్ర విసర్జన చేసేందుకు విద్యార్థినులు క్యూలో నిలబడి, నిరీక్షించాల్సి వస్తుంది. క్యూలో నిలబడే ఓపిక లేక చాలా మంది సమీపంలోని తమ ఇండ్లకు వెళ్లివస్తున్నారు. పాఠశాల కాంపౌండ్‌కు ఆనుకొని గుట్ట బోరు ఉండడంతో బాలురు ఒంటికి, రెంటికి అక్కడికే వెళ్తున్నారు. వానకాలం కావడంతో గుట్ట ప్రాంతం చెట్లు, గడ్డితో నిండి ఉండడంతో ఇటీవలి కాలంలో బాలురు అటువైపు వెళ్లేందుకు భయపడుతున్నారు. కొందరు ఆడపిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. బడికి వచ్చేటప్పుడు ఇంటి వద్ద మూత్ర విసర్జన చేసి వస్తున్నామని, బడిలో దాహమైనా నీళ్లు తాగడంలేదని చెబుతున్నారు. మళ్లీ బడి ముగిసి ఇంటికి వెళ్లిన తర్వాతనే నీళ్లు తాగుతున్నామని పలువురు బాలికలు తమ ఆవేదనను వెలిబుచ్చారు.
జాబితాపూర్ ప్రభుత్వ బడుల్లో మూత్ర విసర్జన కోసం విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వెలుగు చూశాయి. పలు సామాజిక మాద్యమాల్లో ఫొటోలు వైరల్ కావడంతో ఎమ్మెల్సీ కవిత చూసి చలించారు. సమస్యను తెలుసుకొని విద్యార్థులకు అండగా నిలువాలని సామాజిక మాద్యమం ద్వారా జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతకు సూచించగా, బుధవారం ఆమె స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను కండ్లారా చూసి ఆమె సైతం చలించిపోయారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, అధైర్య పడొద్దని దావ వసంత విద్యార్థులకు భరోసానిచ్చారు.
జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 25: ‘139 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఒకటే టాయిలెట్ ఉంటుందా..? మరీ ఇంత ఘోరమా..? పిల్లల పరిస్థితి చూస్తే హృదయం చలించిపోతున్నది’ అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఆవేదన చెందారు. వెంటనే అవసరమైన టాయిలెట్స్ నిర్మించాలని కోరారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో సమస్యలపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చలించిపోగా, ఆమె సూచనల మేరకు బుధవారం పాఠశాలను దావ వసంత పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కారు చేపట్టిన ‘మన ఊరు – మన మనబడి’ పథకం పేరు మాత్రం మార్చివేసిందని, ప్రగతిని గాలికొదిలేసిందని మండిపడ్డారు. పాఠశాలలో 139 మంది విద్యార్థులకు ఒకటే టాయిలెట్ ఉండడం బాధాకరమన్నారు. తాను జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలోనే స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు 10లక్షలు నిధులు కేటాయించినట్టు చెప్పారు. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల పనులు చేయకపోగా, నిధులను సైతం జడ్పీకి తిరిగి పంపించారన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలకు బాబితాపూర్ స్కూల్ ఎంపికైందని పనులు ఎందుకు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇటీవల ఓ ప్రజాప్రతినిధి తన వ్యక్తిగత అభివృద్ధి కోసం కండువా మార్చి, నియోజకవర్గ అభివృద్ధి కోసమని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఏది ఏమైనా స్కూల్లో వెంటనే టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు జలంధర్, రూరల్ మండల సమన్వయ కమిటీ సభ్యులు చిత్తరి శ్రీనివాస్, పడిగెల గంగారెడ్డి, లక్ష్మణ్, మాజీ సర్పంచ్ బుర్ర ప్రవీణ్, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు చిత్తారి సురేశ్, బీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ గౌడ్, నాయకులు మహేశ్, సంతోశ్, సాగర్, ప్రణయ్, ప్రతాప్, సాయి ఉన్నారు.