Sircilla | కలెక్టరేట్, జూలై 6 : విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే స్పష్టమైన ప్రణాళికతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని టీజీటీడబ్ల్యూ ఆర్జేసీ విద్యాలయాన్ని సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యా, వసతి, ఆహార ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా స్టోర్‌రూమ్‌ను సందర్శించిన కలెక్టర్ బియ్యం, పప్పులు, గుడ్లు తదితర నిత్యావసర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని తనిఖీ చేసి, ఆహారం నాణ్యంగా ఉండటంతో పాటు మెనూ ప్రకారమే అందించాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులతో కలిసి భోజనశాలలో కూర్చొని వారి సమస్యలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం కోడిగుడ్లు, పాలు, ఇతర పోషకాహార పదార్థాలు అందుతున్నాయా అని విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివితే తప్పకుండా విజయాన్ని సాధించగలరన్నారు. విద్యతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరమని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా విద్యార్థులకు మెరుగైన విద్య, పోషకాహారం, వసతి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.