Vemulawada | వేములవాడ, ఏప్రిల్ 28 : ఇల్లు కావాలంటే లక్షన్నర ఇవ్వాల్సిందేనని అధికారుల సాక్షిగా అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పాలకవర్గం నాయకులు లబ్ధిదారులను డిమాండ్ చేస్తున్నారని బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు ఆరోపించారు. బీజేపీ కౌన్సిలర్లు వంగల శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్, నాయకులు రేగుల శ్రీకాంత్, మామిండ్ల లక్ష్మీ రాజం వేములవాడ నాంపల్లి పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను మంగళవారం పరిశీలించి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ అయాములో నిర్మాణంలో ఉన్న 144 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గత ఆరు మాసాల క్రితం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ పురపాలక సంఘం పరిధిలో ఇంటి నిర్మాణానికి కూడా స్థలం లేని నిరుపేదలను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ లను ఇందిరమ్మ ఇండ్ల గా పట్టాలు అందజేశారని ఆరోపించారు.
ఇందులోనూ అవకతవక జరిగాయని విమర్శించారు. దాదాపు 30 శాతం పనులు పూర్తైన వాటిని పూర్తి చేసి ఇస్తామని హామీ ఇచ్చి పట్టాలు ఇవ్వగా ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పాలకవర్గంలోని నాయకులు అధికారుల సాక్షిగా లబ్ధిదారులను డబ్బుల కోసం బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఒక్కో లబ్ధిదారుడు రూ.లక్ష్యా 50వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు మండిపడ్డారు. మరికొందరు కాంగ్రెస్ కౌన్సిలర్ల నాయకులు ఇంకొక అడుగు ముందుకు వేసి రూ.రెండున్నర లక్షల వరకు కూడా డిమాండ్ చేస్తూ ఇవ్వకుంటే రెండో వారికి కేటా ఇస్తామని బెదిరింపులు కూడా పాల్పడుతున్నారని అన్నారు. నిరుపేదలుగా ఉన్నవారికి ఇండ్లను కేటాయించి ఇప్పుడు వారి నుండి డబ్బులు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. పూట గడవడమే కష్టంగా ఉండే నిరుపేదలు ఎలా డబ్బులు ఇస్తారని ఎందుకు ఈ అక్రమాలకు తెర లేపారంటూ మండిపడ్డారు. రూ.3 కోట్ల అవినీతికి తెరలేపిన కాంగ్రెస్ నాయకులు వ్యవహారాన్ని పేదల పక్షాన నిలబడి కొట్లాడి వారికి ఇళ్లను అప్పగించే బాధ్యత తీసుకుంటామని వారు అన్నారు.
మంత్రి పదవి కోసమే ఆది శ్రీనివాస్ తిరుగుతున్నాడని మండిపాటు
మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస ప్రజా సమస్యల మీద ఆది శ్రీనివాస్ కు లేదని బీజేపీ నాయకులు రేగుల శ్రీకాంత్ విమర్శించారు. పొద్దున్నుండి రాత్రి దాకా ప్రతిరోజు తిరుగుతూ తాను ప్రజల మధ్యలో ఉన్నానని చెప్పుకొస్తున్న నాయకుడు ఆది శ్రీనివాస్ అసలు ప్రజా సమస్యలే గాలికి వదిలేసి ఆయన మంత్రి పదవి కోసం మాత్రమే తిరుగుతున్నారని ఆరోపించారు. వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి మేడిపండులా ఉందని ఎద్దేవా చేశారు. వేములవాడ గుడి అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చే నాయకుడు అసలు ఏం అభివృద్ధి జరుగుతుంది ఎన్ని కోట్ల నిధులు తెచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.