సిరిసిల్ల టౌన్, జూలై 25 : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ‘ఏసీబీ కేసు నమోదైంది. వెంటనే డబ్బులు పంపాలి. లేకపోతే అరెస్ట్ తప్పదు’ అని బెదిరిస్తూ ఉద్యోగుల ఖాతాల్లో నుంచి డబ్బులు అపహరిస్తున్న ఘటనలు సర్వ సాధారణమైపోయాయి. ఇలాగే, సిరిసిల్ల సెస్ కార్యాలయంలో ఓ ఉద్యోగికి శనివారం సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి తాము ఏసీబీ అధికారులమని పరిచయం చేసుకొని ‘మీపై ఏసీబీకి ఫిర్యాదు వచ్చింది.
కేసు నమోదైంది’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే రూ.10 లక్షలు పంపాలని, లేకపోతే ఇంటి ముందు పోలీస్ వాహనం సిద్ధంగా ఉన్నదని, అరెస్ట్ చేసి తీసుకెళ్తామని చెప్పారు. కంగుతిన్న సదరు ఉద్యోగి రూ.1.50 లక్షలు డబ్బులు పంపినట్టు తెలిసింది. అనంతరం తాను మోసపోయినట్టు సదరు ఉద్యోగి గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.
ఇదే విషయమై సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి స్పందిస్తూ.. సెస్‌లో లైన్ ఇన్స్పెక్టర్కు సైబర్ నేరగాళ్లు ఏసీబీ అధికారుల పేరుతో బెదిరించగా రూ 1.50 లక్షలు ఫోన్‌పే చేశాడని తెలిపారు. అతడితోపాటు మరికొందరు ఉద్యోగులను సైతం వారు బెదిరించినట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.