బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచింది. సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో దూసుకుపోతున్నది. బుధవారం కరీంనగర్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ బొమ్మకల్‌లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించగా, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మానకొండూర్ అభ్యర్థి రసమయి బాలకిషన్ గన్నేరువరం మండలం జంగపెల్లిలో ప్రజాశీర్వాద యాత్రకు హాజరయ్యారు. ఇక హుజూరాబాద్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి జమ్మికుంటలో ముఖ్య కార్యకర్తలతో సమావేశమై, హుజూరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. గంగాధర మండలం మధురానగర్‌లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పార్టీ కార్యాలయం ప్రారంభించగా, హుస్నాబాద్ అభ్యర్థి వొడితల సతీశ్ కుమార్ ప్రచారంలో స్పీడు పెంచారు.
కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం బొమ్మకల్‌లో మంత్రి గంగుల కమలాకర్ విస్తృత ప్రచారం చేశారు. ముందుగా యజ్ఞవరాహస్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆయన, రోడ్‌షో నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. నగరంలోని కాపువాడలో కలియదిరిగారు. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో మానకొండూర్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రజా గర్జన సభ నిర్వహించారు. అలాగే తిమ్మాపూర్‌లోని పార్టీ ఆఫీస్‌లో పోలంపల్లి, నర్సింగాపూర్‌కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరగా, కండువా కప్పి ఆహ్వానించారు.
జమ్మికుంట పట్టణంలో 11, 12, 16, 22, 30వ వార్డుల్లో హుజూరాబాద్ అభ్యర్థి, మండలి విప్, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. హుజూరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరేయాలని కోరారు. గంగాధర మండలం మధురానగర్‌లో బీఆర్ఎస్ మండల కార్యాలయాన్ని చొప్పదండి అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. నాయకులతో సమావేశమయ్యారు. విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటించిన రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఎవరేం చేసినా బీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. హుస్నాబాద్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ ప్రచారంలో స్పీడు పెంచారు. సిద్దిపేట జిల్లా అకన్నపేట మండలం గండిపల్లి, పంచరాయి తండా, అమ్మ తండా, కెప్టెన్ కాలనీలో అలుపెరుగని ప్రచారం చేశారు.
గులాబీ జోష్మీదున్నది. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నది. ప్రతిపక్షాలు అందుకోలేని ఎత్తులో పరుగులు పెట్టిస్తున్నది. ఇంటింటికీ చేరువవుతూ, మద్దతు కూడగడుతున్నది. కాగా, ఎక్కడికి వెళ్లినా గులాబీ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై వివిధ పార్టీల కేడర్ అంతా ఇంటి పార్టీలో చేరిపోతున్నది. ఇంకా ప్రతిపక్షాలు అభ్యర్థుల ఎంపికలోనే ఉండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా గులాబీ దళాల సందడే కనిపిస్తోంది.
– కరీంనగర్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ)