కోరుట్ల, అక్టోబర్ 29: కోరుట్లలో బీఆర్ఎస్ జోరు పెరిగింది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నది. ఊరా వాడా గులాబీ శ్రేణుల హోరు కనిపిస్తుండగా, నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల జనంలోనే కలియదిరుగుతున్నారు. యువతతో మమేకమై ముందుకుసాగుతుండగా, మరోవైపు బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనకు మెచ్చి వివిధ పార్టీల నాయకులు పార్టీలో చేరిపోతున్నారు.
ఆదివారం కోరుట్ల పట్టణంలోని 7వ వార్డు అర్బన్ కాలనీకి చెందిన 50 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి సంజయ్ కల్వకుంట్ల గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులతో సంజయ్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తేనే అనుకున్న పనులు జరుగుతాయని చెప్పారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని, కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతున్నదని చెప్పారు. ఇక్కడ మున్సిపల్ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, పీఏసీఎస్ చైర్మన్ ఎలిశెట్టి భూంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పుప్పాల ప్రభాకర్, అతిక్, అర్బాజ్, చిత్తరి ఆనంద్ ఉన్నారు.