Old Students Meet | జగిత్యాల, ఫిబ్రవరి 10 : జగిత్యాల ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పండుగ వాతావరణంలో కొనసాగింది. 1999-2000 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు జగిత్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించుకున్నారు. ముందుగా తమకు భౌతికంగా దూరమైన పలువురు పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. తమకు చదువు చెప్పిన గురువులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కాళ్లు కడిగి పాదాభివందనం చేసి ఉపాధ్యాయులపై తమ గౌరవాభిమానాలను చాటుకున్నారు.
ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ 25 ఏండ్ల తర్వాత విద్యార్థులు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. తాము తీర్చిదిద్దిన విద్యార్థులు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా, జర్నలిస్టులుగా, వివిధ రంగాల్లో ఉన్నతంగా స్థిరపడటం ఆనందంగా ఉన్నదని తెలిపారు. ప్రస్తుత సమాజంలో మానవీయ విలువలను కాపాడాలంటే అది తల్లిదండ్రులతోనే సాధ్యమని, పిల్లల్లో పెద్దలు, గురువుల పట్ల గౌరవభావాన్ని పెంపొందించాలని సూచించారు. కొన్నిచోట్ల విద్యార్థులు గంజాయి, ఇతర వ్యసనాలకు బానిసలు కావడం ఆందోళన కలిగిస్తున్నదని, చదువులో వెనుకబడిన విద్యార్థులను దండిస్తే తల్లిదండ్రులు తమతో గొడవ పెట్టుకుంటున్నారని, ఇలా అయితే విద్యార్థి భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడుతుందని వాపోయారు.
విద్యార్థులు, యువత మద్యం, ఇతర వ్యసనాలకు బానిసలు కాకూడదని, ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని అందుకు అనుగుణంగా ప్రణాళికతో ముందుకెళ్లి మంచి భవిష్యత్ నిర్ణయించుకోవాలని సూచించారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని, ఎప్పుడూ పలకరిస్తూ వారికి భరోసా ఇవ్వాలని తెలిపారు. కలెక్టర్ అని, డాక్టర్ అని, ఇంజినీర్ అని పిల్లలకు ఇష్టం లేకుండా వారిపై ఒత్తిడి తేవద్దని, వారు ఏ రంగంలో రాణిస్తారో గుర్తించి ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రతిభను గుర్తించి అవార్డులు ఇవ్వాల్సిన వ్యవస్థ పోయి ఉపాధ్యాయులే అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాల్సి రావడం బాధాకరమని వాపోయారు. సమ్మేళనం సందర్భంగా విద్యార్థులే కుటుంబసభ్యుల్లా స్వయంగా వంటలు చేసుకుని అందరికీ వడ్డించుకున్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు జాతీయ అవార్డు గ్రహీత కైలాసం, రాజేశ్వర్, శ్రీనివాసరావు, కృష్ణగోపాల్, అజయ్‌కుమార్, ప్రకాశ్‌రావు, గంగాధర్, కిషన్, జగపతి పాల్గొన్నారు.