Oil Farm | పెద్దపల్లి, మే8: జిల్లాలో 2025 -26 సంవత్సరానికి గానూ ఆయిల్ పామ్ సాగు లక్ష్యం 2500 ఎకరాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో హార్టికల్చర్ అధికారులతో గురువారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగు లక్ష్యాల సాధనకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలన్నారు.
ఖరీఫ్ సీజన్లో 1500 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే లాభాలు, మొక్కలు, డ్రిప్, అంతర్ పంటల నిమిత్తం ప్రభుత్వం అందించే సబ్సిడీ, సంబంధిత అంశాల పట్ల రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు విస్తరించేందుకు పక్కా ప్రణాళిక 4 రోజులలో తయారు చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా హార్టికల్చర్ అధికారి జగన్ మోహన్ రెడ్డి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.