కలెక్టరేట్, మార్చి 21 : జలం ప్రాణికోటికి జీవనాధారం. నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు భూగర్భజలాల పెంపునకు ప్రతి వ్యక్తి పాటుపడినప్పుడే మానవ మనుగడ సాధ్యం. దీనిని గుర్తించిన గత బీఆర్ఎస్ సర్కారు జలసంరక్షణ చర్యలకు ప్రాధాన్యమిచ్చింది. నీటి ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పిం చడంతో పాటు ఇంటింటా ఇంకుడు గుంత నిర్మాణం తప్పనిసరి చేసింది. అయితే, గత కొంత కాలంగా నూతన భవన నిర్మాణాల్లోనూ వాటి జాడ లేకపోగా, కాంగ్రెస్ పాలకులు, అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో ఏటేటా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టేలా సంబంధితాధికారులు చర్యలు తీసుకోవాలని, ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసే ముందు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విధానం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశిస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవోనం168తో ఉత్తర్వులు విడుదల చేసింది. ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు అదనంగా మరిన్ని నిధులు విడుదల చేస్తూ ప్రోత్సహించింది. ఫలితంగా జిల్లాలో రెండేళ్ల కాలంలో కొత్తగా నిర్మించుకున్న ఇళ్లలో 60 శాతానికి పైగా ఇంకుడు గుంతల నిర్మాణం జరిగింది.
పట్టించుకోని అధికారులు..
రెండేళ్లలో 50వేల పైచిలుకు జిల్లాకు మంజూరు కాగా, 32వేలకు పైగా పూర్త యినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, ఉన్న ఇళ్లల్లో కూడా మెజారిటీ సంఖ్యలో పూర్తయ్యాయి. వర్షాకాలంలో వర్షపు నీటితో పాటు సాధారణ రోజుల్లో ఇళ్ల నుంచి వెలువడే వృథా నీరు కూడా భూగర్భంలోకి ఇంకుతుండగా బోరు బావుల్లో నీటి లభ్యత పెరిగేది. గత పదిహేను నెలల నుంచి వీటి నిర్మాణంపై అధికారులు గానీ, పాలకులు గానీ అంతగా పట్టించుకోకపోవడంతో నూతన గృహాల నిర్మాణం వేల సంఖ్యలో పెరుగుతున్నా ఇంకుడు గుంతలు మాత్రం వందల్లో కూడా చేపట్టడం లేదని అధికారుల గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.
నిబంధనలకు నీళ్లు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో నూతనంగా ఇళ్ల నిర్మాణం మొదలు కాగా, వీటిలో రెండు శాతం కూడా ఇంకుడు గుంతల పనులు చేపట్టలేదు. ప్రధానంగా కమర్షియల్ కాంప్లెక్సులు, అపార్టుమెంట్లు, భారీ భవంతుల్లో కూడా ఇంకుడు గుంతల నిర్మాణం ఖచ్చితంగా చేపట్టాలని, ఇళ్ల యజమానులు పట్టించుకోపోతే భారీగా జరి మానా విధించాలని జీవో నం.168 చెబుతున్నా అధికారుల నిర్లక్ష్యంతో అది పకడ్బందీగా అమలు కాని పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో ఇళ్ల యజమానులు ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.