కోనరావుపేట, మే 28 : రైతులు కన్నెర్ర జేశారు. సన్నపు వడ్ల కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట రైతులు రోడ్డెక్కారు. వడ్లు కొనకపోతే చావే శరణ్యం అంటూ పురుగుల మందు డబ్బాలు చేతపట్టుకొని ఆందోళన చేశారు. ధాన్యం కొంటరా..? కొనరా..?, మా ఆరుగాలం కష్టం నీళ్లపాలు చేస్తరా..? అని ప్రశ్నించారు. బోనస్ దేవుడెరుగు..? కనీసం కొనుగోలైనా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకట్రావుపేటలో ప్రభుత్వం రెండు నెలల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిందని చెప్పారు.
రైతులు పంటను కోసింది కోసిన్నట్లుగా ధాన్యాన్ని కేంద్రానికి తరలిస్తే, అధికారులు అంతంతమాత్రంగానే దొడ్డు వడ్లను కొన్నారని, సన్నపు వడ్లను పక్కన పెట్టేశారని వాపోయారు. సెంటర్ నిర్వాహకులను అడిగితే మిల్లర్లు సన్నపు వడ్లు దించుకోవడం లేదని, ఏం చేయలేమంటూ చేతులేత్తేశారని, దీంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఇటీవల వర్షానికి ధాన్యం మొలకలు వచ్చిందని, ఇలా తమను గోస పెట్టడం సరికాదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి సెంటర్లోని వడ్లు కొనుగోలు చేయాలని లేదంటే పురుగుల మందే దిక్కని పేర్కొన్నారు.