Chinnakalvala | సుల్తానాబాద్ రూరల్, జూన్ 19 : అనుమతులు లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లపై చర్యలు తీసుకోవాలని ఉప సర్పంచ్ బొంగోని కుమార్ గౌడ్, గ్రామపంచాయతీ కార్యదర్శి రణధీర్ కోరారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను శుక్రవారం ఉప సర్పంచ్ బొంగోని కుమార్ గౌడ్, గ్రామపంచాయతీ కార్యదర్శి రణధీర్, వార్డు సభ్యులు చుక్క రాజమౌళి, తిరుపతి, దేవ, నాయకులు ఆనంద్ స్వామి, మొండయ్య, అంజయ్య, సమ్మయ్య, నరేష్ అక్రమ వెంచర్ల ను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వెంచర్లను ఏర్పాటు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయానికి గండి కొట్టడం తోపాటు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. దాదాపు 12 ఎకరాలలో వెంచర్లు చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత రిజిస్ట్రేషన్ అధికారులు ఈ సర్వే నెంబర్ లపై రిజిస్ట్రేషన్ చేయవద్దని కోరారు. వ్యవసాయ భూములకు వెళ్లే కాలువలు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ నుంచి నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.