Arrangements | ఓదెల, సెప్టెంబర్ 3: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో శుక్రవారం జరగనున్న గణేష్ నిమజ్జనం ఉత్సవాల ఏర్పాట్లను శుక్రవారం అధికారుల బృందం పరిశీలించింది. గణేష్ నిమజ్జనం ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ, ట్రాన్స్కో డిపార్ట్మెంట్లుతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై దీకొండ రమేష్ గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరగడానికి పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. రాత్రి 9 గంటల లోపు నిమజ్జనోత్సవాలు పూర్తి అయ్యేటట్లు చూడాలని కోరారు. నిమజ్జనం ఉత్సవాల సందర్భంగా గజ ఈతగాలను అందుబాటులో ఉంచుకోవాలని, ఊరేగింపు సందర్భంగా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మద్యం తాగి ఊరేగింపులో పాల్గొనకుండా అవగాహన కల్పించాలని, డీజే సౌండ్ లను నిషేధించినట్లు పేర్కొన్నారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిమజ్జనం ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేట్లు చూడాలని కోరారు. ఇందుకు పోలీసులు అన్ని రకాల సహకారాలను అందిస్తారని తెలిపారు. అనంతరం ఓదెల మండల కేంద్రంలోని వినాయక చెరువులో నిమజ్జనం ఏర్పాట్లను అధికారుల బృందం పరిశీలించింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తిరుపతి, ఇన్చార్జి తహసీల్దార్ సతీష్, వైద్యాధికారి సహబాజ్ ఖాన్, ఎంపీఓ షబ్బీర్ పాషా, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.