కార్పొరేషన్, నవంబర్ 29: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఏర్పాట్లు చేపట్టారు. నియోజకవర్గంలో మొత్తం 3,55,054 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,77,893, మహిళలు 1,77,117, ట్రాన్‌జెండర్లు 44 మంది ఉన్నారు. కాగా, నియోజకవర్గంలో 390 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. నగరంలో 131 పోలింగ్ కేంద్రాలు ఉండగా కొత్తపల్లి మండలంలో 61, కరీంనగర్ రూరల్ మండలంలో 70 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 69 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా అధికారులు గుర్తించారు.
ఈ కేంద్రాల విషయంలో ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు కూడా చేపడుతున్నారు. నియోజకవర్గంలోని ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. నియోజకవర్గంలో 18 కేంద్రాలను మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ కేంద్రాలను ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఓటర్లను ఆకర్షించేలా చర్యలు చేపడుతున్నారు. కాగా, పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
కరీంనగర్ రూరల్ మండలంలో..
కరీంనగర్ రూరల్, నవంబర్ 29: మండలంలో ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశారు. 24 పోలింగ్ కేంద్రాల్లోని 67 బూత్‌లలో 53,802 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో పోలింగ్ బూత్‌కు పోలింగ్ అధికారితోపాటు ఏపీవో, ముగ్గురు సిబ్బందిని కేటాయించారు. ఎన్నికల సిబ్బంది బుధవారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆరెపల్లి, ఫకీర్‌పేట గ్రామాల్లో మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దారు. దుర్శేడ్, చామనపల్లి, చేగుర్తి, బొమ్మకల్, నగునూర్, మొగ్దుంపూర్, గోపాల్పూర్ గ్రామాల్లో పలు పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.
చొప్పదండి, నవంబర్ 29: పట్టణంతో పాటు మండలంలో అసెంబ్లీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని 6 మండలాల్లో 327 కేంద్రాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,32,990 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 113050, పురుషుల ఓటర్లు 119933, ఇతరులు 7 ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
గంగాధర, నవంబర్ 29: జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మండలంలో రెండు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో ఎన్ఆర్ మల్హోత్రా తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 26వ పోలింగ్ కేంద్రాన్ని మోడల్ పోలింగ్ కేంద్రంగా, మధురానగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన 29వ పోలింగ్ కేంద్రాన్ని మహిళా మోడల్ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మోడల్ పోలింగ్ కేంద్రాల ప్రధాన ద్వారాన్ని మామిడి తోరణాలతో అలంకరించారు. కేంద్రం వద్ద బతుకమ్మ, రంగోళి, సెల్ఫీ పాయింట్, మహిళలు, ఎన్నికలకు సంబంధించిన ప్లకార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గోడలకు అందమైన పేయింటింగ్ వేయించామని, ఓటు వేయడానికి వచ్చే మొదటి 20 మందిని ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు తెలిపారు.