జగిత్యాల నడిబొడ్డున రూ.వంద కోట్ల విలువైన మున్సిపల్ భూమి అన్యాక్రాంతంపై అధికార యంత్రాంగం కదిలింది. భూ కబ్జాతో పాటు అనుమానాస్పదమైన కిబాల పత్రం రికార్డుల ట్యాంపరింగ్, తదితర అంశాలను ప్రస్తావిస్తూ ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన వరుస కథనాలతో రంగంలోకి దిగింది. 20 గుంటల భూమిపై సమగ్ర నివేదిక అందజేయాలని అదనపు కలెక్టర్ రాజగౌడ్తోపాటు ఆర్డీవో పులి మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ స్పందనకు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు సమగ్ర నివేదిక రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. వివాదాస్పదంగా మారిన పెట్రోల్బంక్తోపాటు ఇతర భవన సముదాయాలను రెవెన్యూ, మున్సిపల్, నేషనల్ హైవే అథారిటీ అధికారులు గురువారం పరిశీలించారు.
జగిత్యాల, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలోని సర్వే నంబర్ 138లో పెట్రోల్, కిరోసిన్ విక్రయ షెడ్డు కోసం మున్సిపాలిటీ 20 గుంటల భూమిని శిస్తు చెల్లించి వినియోగించుకునే పద్ధతిపై కేటాయించింది. అయితే, ఆ భూమిని కిబాల పత్రం ద్వారా కొనుగోలు చేశామంటూ వ్యాపారి వారసులు భూమిని సొంతం చేసుకున్నారు. నాలుగు గుంటల్లో పెట్రోల్ బంక్‌ను నిర్వహిస్తూ, మిగిలిన 16 గుంటలలో అనేక భవనాలు నిర్మించారు. దాదాపు 70 ఏళ్లుగా ఈ భూమి వివాదాస్పదంగా ఉండిపోయింది. వారం క్రితం నుంచి మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ‘జగిత్యాల నడిబొడ్డున రూ.100 కోట్ల భూకబ్జా?’ ‘సంచలనం రేపిన రూ. 100 కోట్ల భూకబ్జా?’ ‘కిబాల మిస్టరీ తేలేనా..?’ శీర్షికల పేరిట ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురించింది. భూ కబ్జా, అనుమానాస్పదమైన కిబాల పత్రం, రికార్డుల ట్యాంపరింగ్ తదితర అంశాలను కండ్లముందుంచింది. దీంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. అందులో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు సమగ్ర నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు గురువారం పెట్రోల్ బంక్ ఎన్ని గుంటల్లో విస్తరించి ఉంది? అని కొలతలు తీశారు. అలాగే, అదే సర్వే నంబర్లో దారం వీరమల్లయ్య వారసులు నిర్మించిన భవన సముదాయాలు, మధ్యలో వారు నిర్మించిన తోవకు సంబంధించిన కొలతలు వేశారు. అలాగే, షాపింగ్ కాంప్లెక్స్‌కు ఏర్పాటు చేసిన గేటు విస్తీర్ణ వివరాలను నమోదు చేశారు. మూడు శాఖలకు సంబంధించిన అధికారులు, సాంకేతిక నిపుణులు పెట్రోల్ బంక్, భవన సముదాయాలకు సంబంధించిన కొలతలు తీసుకోవడం మొదలు పెట్టగానే ప్రభుత్వం, అధికారుల్లో ఇన్నాళ్లకైనా చలనం వచ్చిందన్న చర్చ మొదలైంది.

ఉర్దూ భాషలో రాయబడి, కిబాల పత్రంగా వ్యాపారి వారసులచే చెప్పబడుతున్న నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పత్రంలోని విషయాలు దాదాపు 70 ఏళ్లుగా వెలుగులోకి రాని విషయం తెలిసిందే. అయితే, రెండు రోజుల క్రితం కొందరు అధికారులు కిబాల పత్రం జిరాక్స్ ప్రతిని ప్రభుత్వ ఆమోదిత ట్రాన్స్‌లేటర్ ద్వారా తర్జుమా చేయించగా, ఆ పత్రంలో అసలు కిబాల అనే పదమే లేదని, కొనుగోలు, అమ్మకం, సేల్‌డీడ్ అన్న ముచ్చటనే లేదన్న విషయం బయటకు వచ్చింది. అలాగే, ఇరవై గుంటల భూమిని మున్సిపాలిటీ వ్యాపారికి విక్రయించలేదని, కేవలం శిస్తు పద్ధ్దతిలో పెట్రోల్, కిరోసిన్ షెడ్డు నిర్మాణానికి పొజీషన్‌ను ఇచ్చిందన్న విషయం అవగతమైంది. ‘కిబాల మిస్టరీ తేలేనా..?’ శీర్షికన గురువారం ‘నమస్తే’ వెలువరించిన కథనం జగిత్యాలలో సంచలనం సృష్టించింది. దీంతో కొందరు నాయకులు కిబాల పత్రంగా చెబుతున్న పత్రం జిరాక్స్‌ను తీసుకొని తర్జుమా చేయించేందుకు హైదరాబాద్‌కు వెళ్లినట్టు సమాచారం. 70 ఏళ్లుగా కిబాల పేరిట కోట్ల విలువైన భూమిని అదుపులో ఉంచుకున్నారా..? అన్న చర్చ ప్రారంభమైంది.
పెట్రోల్ బంక్, 20 గుంటల భూమికి సంబంధించిన వివాదంపై సమగ్ర నివేదిక రూపొందిస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో 138 సర్వే నెంబర్లోని 20 గుంటల భూమి వ్యవహారంపై దృష్టి పెట్టాం. ఈ నేపథ్యంలోనే జగిత్యాల తహసీల్, ఆర్డీవో, రిజిస్ట్రేషన్, మున్సిపల్ ఆఫీసుల్లో పూర్వ రికార్డులను పరిశీలిస్తున్నాం. పెట్రోల్ బంక్తోపాటు వ్యాపారి వారసులు నిర్మించిన భవన సముదాయాలను పరిశీలించి, కొలతలు వేశాం. పెట్రోల్ బంక్ ఎన్ని గుంటల్లో విస్తరించి ఉంది? ఇతర భవనాలు ఎన్ని గుంటల్లో ఉన్నాయని లెక్కలు తీశాం. ఇక రెవెన్యూ, మున్సిపల్ రికార్డులు, న్యాయస్థానాల వ్యాఖ్యలు, కిబాల కొనుగోలు పత్రం స్పష్టత, అందులోని అంశాలన్నింటినీ పరిశీలించి, వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం.

మున్సిపల్‌కు సంబంధించి రూ.వంద కోట్లకు పైగా విలువైన భూమి అన్యాక్రాంతం అయిందా.. లేదా..? అన్న అంశాన్ని తేల్చే విషయంపై జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ సీరియస్‌గా దృష్టి సారించినట్టు సమాచారం. ‘నమస్తే’ వరుస కథనాల నేపథ్యంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించినట్టు తెలిసింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని మూడు రోజుల క్రితమే ఆదేశాలు ఇస్తే.. ఇంత వరకు ఏం చర్యలు తీసుకున్నారని నిలదీసినట్టు సమాచారం. వీలైనంత త్వరగా సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించినట్టు తెలిసింది. రెవెన్యూ రికార్డులతోపాటు, కిబాల పత్రం తర్జుమా, తదితర అంశాలపై దృష్టిపెట్టాలని సూచించినట్టు సమాచారం. అదనపు కలెక్టర్, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లు నివేదికను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. గురువారం రాత్రి అధికారులు సమావేశమై, వివాదాస్పద భూమిపై చర్చించినట్లు సమాచారం. కిబాల పత్రం మిస్టరీ వీడితేనే పూర్తిస్థాయి వివరాలు తెలుస్తాయన్న విషయంలో కలెక్టర్, ఇతర అధికారులు ఆ దిశలో చర్యలకు ఉపక్రమించారు.