చిగురుమామిడి, మార్చి 5: వేసవిలో పల్లె ప్రజలకు తాగునీరు సక్రమంగా అందించేందుకు గత ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టింది. అదే స్ఫూర్తితో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా అవుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో పైప్ లైన్లు లీకేజీలు అవుతున్నాయి. వాటిని ప్రస్తుతం అరికడుతున్నారు. ప్రతిరోజు పైపులైన్ల పరిస్థితిని పంచాయతీ అధికారులు పరిశీలిస్తున్నారు. వేసవిలో ప్రధానంగా పలు గ్రామాల్లోని ప్రజలు బోర్లపైనే ఆధారపడతారు. మండలంలోని 17 గ్రామాలకు గాను 148 చేతి పంపులు ఉన్నాయి.
వాటిలో ప్రస్తుతం 42 చేతి పంపులు రిపేర్లు చేపట్టనున్నారు. అందులో భాగంగా మండలంలోని బొమ్మనపల్లి, సుందరగిరి, చిగురుమామిడి గ్రామాల్లో 15 వరకు చేతిపంపులను రిపేరు చేపట్టారు. ఇంకా పూర్తిస్థాయిలో మరమ్మతులు పలు గ్రామాల్లో చేయాల్సి ఉంది. అధికారుల పర్యవేక్షణ కొరవడంతో కొంత జాప్యం జరుగుతున్నది. ప్రతి నెల 1, 11, 21 తేదీల్లో వాటర్ ట్యాంకులను శుభ్రంగా కడిగి బీచింగ్ చల్లాలి. కానీ చాలా గ్రామపంచాయతీలో అలా జరగడం లేదు. గత ప్రభుత్వంలో పల్లె ప్రజలకు ఎలాంటి తాగునీటిలో అసౌకర్యం, ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారని గ్రామాల్లో ప్రజలు గుర్తు చేసుకున్నారు.
మండలంలో తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు వెళ్లి పర్యవేక్షణ చేపడుతున్నామని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సువిశాల అన్నారు. నీటి ఎద్దడి నివారణకు గాను చేతి పంపుల మరమ్మత్తులను చేపట్టామన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలకు శ్రీకారం చుట్టామన్నారు. అలాగే గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు గాను ముందస్తు ప్రణాళికలు రూపొందించాం. అందులో భాగంగా ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శులతో తాగినీటిపై సమీక్ష నిర్వహిస్తున్నామని ఎంపీడీవో భాశం మధుసూదన్ తెలిపారు. నీటి సమస్య ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలి. వెంటనే పరిష్కారం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు.