కుష్టు వ్యాధి రోగులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు సార్లు ఆశా కార్యకర్తలు చేసిన సర్వే కోసం ఇవ్వాల్సిన నిధుల విషయంలో రగడ నడుస్తోంది. వీటిని జిల్లాలకు విడుదల చేశామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖాధికారులు చెబుతుండగా.. సదరు నిధులు తమకు రాలేదని జిల్లా అధికారులు సెలవిస్తున్నారు. దీంతో.. సర్వే చేసిన ఆశా కార్యకర్తలు ఈ వ్యవహారంపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులకు వినతిపత్రాలు అందజేసిన యూనియన్లు.. ఈ వారంలో ఆందోళన క్యాక్రమాలను నేరుగా చేపట్టాలని నిర్ణయించాయి. అయితే, జిల్లాల వైద్యశాఖాధికారులే వచ్చిన నిధులను మాయం చేసి మాయ మాటల చెబుతున్నారని యూనియన్లు విమర్శించడంతోపాటు. ఆశా కార్యకర్తలకు రావాల్సిన సర్వే డబ్బులు ఇప్పించేందుకు జిల్లా కార్యాలయాలను ముట్టడిస్తామని స్పష్టం చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కుష్టు రోగులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే (కాంపెయిన్) కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 2023 ఆగస్టు 16 నుంచి 31వ తేదీ వరకు మొదటిసారి ఈ సర్వే జరిగింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 26,673 మంది ఆశ కార్యకర్తలను వినియోగించారు. అన్ని ఖర్చులు కలుపుకొని ఒక్కో ఆశ కార్యకర్తకు రూ.1407 చొప్పున చెల్లించడానికి రాష్ట వ్యాప్తంగా మొత్తం రూ.3,75,47,050 కేటాయిస్తూ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధికారులు 2023 జూలై 17న ఉత్తర్వులు జారీచేశారు. అంటే సర్వేకు ముందుగానే ఈ ఉత్తర్వులు జారీ ఆయ్యాయి. అలాగే, ఈ ఏడాది మార్చి 11 నుంచి 24వ తేదీ వరకు రెండోసారి సర్వే జరిగింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 28,160 మంది ఆశ కార్యకర్తలను వినియోగించగా, వీరికి రూ.1400 చొప్పున చెల్లించడానికి రూ.3,94,24,100 కేటాయిస్తూ ఫిబ్రవరి 5న ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం చూస్తే.. సర్వేకు ముందుగానే రెండు సార్లు నిధుల కేటాయింపులు జరిగాయి. ఆ మేరకు.. ఆయా జిల్లాల వారీగా సర్వేకు వినియోగించే ఆశ కార్యకర్త, వారికి చెల్లింపులు, అవసరమైన నిధుల వంటి పూర్తి వివరాలను పేర్కొంటూ జిల్లా వైద్యాధికారులకు ఉత్తర్వులు వచ్చాయి. ఇందులో భాగంగానే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనూ సర్వే జరిగింది. ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే మొదటిసారి జరిగిన సర్వే కోసం 2,388 మంది ఆశ కార్యకర్తలను వినియోగించారు. వీరి కోసం రూ.34,09,500ల నిధులు కేటాయించారు. అలాగే, రెండో సారి 2,388 మందినే వినియోగించగా వీరికోసం రూ.34,15,500 కేటాయించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆశ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించి సర్వే చేశారు. ఈ సమయంలో ప్రభుత్వం అత్యంత కఠినమైన నిబంధనలు పెట్టింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ సెలవు తీసుకోరాదని, సర్వేలో ఖచ్చితంగా పాల్గొని పకడ్బందీగా చేయాలని, ఎక్కడ తప్పులు దొర్లినా చర్యలు తీసుకుంటామని, నిర్ధిష్ట ఫార్మెట్లో నిర్ధిష్ట కాలంలో పూర్తిచేయాలని ఆదేశించింది. ఆ మేరకు.. ఆశ కార్యకర్తలు వృత్తి నిబద్ధతను కనపరిచారు. సమయం తక్కువగా ఉన్నా ఇచ్చిన గడువులోపు సర్వే పూర్తి చేశారు. నిబద్ధతతో పనిచేసిన ఆశ కార్యకర్తలకు ఇవ్వాల్సిన పేమెంట్ విషయంలో మాత్రం ఆలస్యం జరుగుతోంది. సర్వేలో పాల్గొన్న ఒక్కో ఆశ కార్యకర్తలకు రెండుసార్లు కలిపి దాదాపు రూ.2800 వరకు వస్తుంది. కానీ, నేటి వరకు ఒక్కపైసా వారికి ముట్టలేదు. తమకు రావాల్సిన సర్వే డబ్బులు ఇప్పించాలని కోరుతున్నా.. తమకు సమాచారం లేదంటూ ఇన్నాళ్లూ జిల్లా వైద్యాధికారులు దాటవేస్తూ వచ్చారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆశ కార్యకర్తలు సీఐటీయూ యూనియన్ను ఆశ్రయించగా.. సదరు యూనియన్ నాయకులు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర కార్యాలయం నుంచి తీసుకున్నారు. రెండు సార్లు సర్వేకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయించిన నిధులు, మంజూరైన ఉత్తర్వులను సంపాదించిన యూనియన్ నాయకులు వాటిని ఆశా కార్యకర్తలందరికీ పంపించారు. ఇది చూసిన ఆశావర్కర్లు తాజాగా.. సదరు ఉత్తర్వులను జతచేస్తూ తమకు సర్వే డబ్బులు ఇప్పించాలని కోరుతూ అన్ని జిల్లాల డీఎంహెచ్‌వో అధికారులను కలసి వినతిపత్రం సమర్పించారు. అయినా, అధికారుల నుంచి గానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి స్పందనా కానరావడం లేదు.
ఈ నేపథ్యంలో.. సర్వే డబ్బుల కోసం సమరం సాగించాలని నిర్ణయించిన ఆశా కార్యకర్తలు కార్యాచరణకు పూనుకున్నారు. మూడు, నాలుగు రోజుల్లో ప్రభుత్వం నుంచి గానీ, అధికారులనుంచి గానీ స్పందన రాకపోతే.. ముందుగా అన్ని జిల్లాల్లో డీఎంహెచ్‌వో కార్యాలయాలను ముట్టించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికీ స్పందించకపోతే హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అయితే, ఇదే విషయంపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు పీ జయలక్ష్మి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. సర్వేకు సంబంధించిన డబ్బుల డీఎంహెచ్‌వోలకు పంపినట్లుగా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖాధికారులు చెపుతున్నారని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా తమకు ఇచ్చారన్నారు. అయితే, జిల్లాల్లో మాత్రం డీఎంహెచ్వోలు ఈ విషయంలో అబద్దాలు చెప్పడమే కాకుండా..వచ్చిన నిధులను మాయంచేసి మాయ మాటలు చెపుతున్నారని విమర్శించా రు. అందుకే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామని, సర్వే చే సిన ఆశా కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని, ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిధులు కేటాయించి, జిల్లాలకు ఉత్తర్వులు జారీచేసినట్లుగా చెపుతున్న రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ.. సంబంధిత నిధు టలు విడుదల చేశారా? లేదా?, చేస్తే అవి ఏమైనట్లు?, ఒక వేళ విడుదల చేయకపోతే.. ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టమైన క్లారిటీ ఇస్తే. తప్ప ఈ రగడ ఆగదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆశావర్కర్లు ఆందోళన బాట పడితే క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయన్న అభిప్రాయాలు వస్తున్నాయి.