రైతు భరోసా.. పరిహాసంలా మారింది. ఇప్పటికి మూడెకరాల వరకు అందించినట్టు ప్రభుత్వం ప్రకటించినా, పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయం అందనట్టు తెలుస్తున్నది. భూ విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా తక్కువగానే వేయగా, ఉన్న భూమి కన్నా పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఎక్కువ విస్తీర్ణం ఉంటే ఆయా సర్వే నంబర్లలో ఏ ఒక్కరికీ అందించలేదు. సాగు యోగ్యమైన భూమి అయినా రెండు మూడు సీజన్లలో సాగు చేయలేదని ఇవ్వడం లేదు. ఇలా రకరకాల కారణాలతో వేలాది మందికి సగం సగమే రైతు భరోసా ఇవ్వగా, అసలు రైతుల వివరాలు అందుబాటులో లేవని వేలాది మందిని పక్కన పెట్టేశారు. వివరాలు ఉన్న వేలాది మంది అన్నదాతలకు కూడా ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచారు. ఇప్పటి వరకు మూడెకరాల వరకే ఇచ్చినట్టు చెబుతున్నా, ఇంకా ఎన్ని ఎకరాలకు ఇస్తారనే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేందుకు అధికారులు వ్యవసాయ యోగ్యమైన భూముల సర్వే చేశారు. కరీంనగర్ జిల్లాలో 5,476 ఎకరాలు సాగు యోగ్యత లేనివని తేల్చారు. మిగతా భూమికి రైతు భరోసా ఇవ్వొచ్చని ప్రభుత్వానికి నివేదించారు. ఎకరాకు ఏటా 12 వేలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ యాసంగి సీజన్లో 2,09,450 మంది రైతులకు 213.95 కోట్ల పెట్టుబడి సాయం అందించాలని జిల్లా వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఆ మేరకు రైతుల వివరాలు సేకరిస్తున్నారు. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 1,95,945 మంది వివరాలు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇంకా 13,505 మంది వివరాలు సేకరించాల్సి ఉన్నది.
అధికారులు ఓవైపు రైతుల వివరాలు సేకరిస్తూనే.. మరోవైపు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వారి వివరాలను ట్రెజరీకి పంపించారు. 1,81,661 మంది రైతుల ఖాతాల్లో 170.34 కోట్లు జమ చేయాలని పంపారు. ఇంకా 14,284 మందిని వదిలేశారు. అయితే అందులోనూ 1,38,697 మంది రైతులకే 101.36 కోట్లు జమ చేశారు. ట్రెజరీకి పంపిన వారిలో ఇంకా 42,964 మంది రైతులకు 68.98 కోట్లు జమ చేయాల్సి ఉంది. రైతు భరోసా ప్రారంభించి రోజులు గడుస్తున్నా పెట్టుబడి సహాయం అందక పోవడంతో రైతుల్లో అసహనం వ్యక్తమవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మూడెకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా ఇచ్చామని ప్రకటించినప్పటీకీ, కొందరు రైతులు తమ ఖాతాల్లో పడలేదని చెబుతున్నారు. కొందరికి తమకున్న విస్తీర్ణంలో పూర్తి స్థాయిలో జమ కాలేదని వాపోతున్నారు. దీనికి అధికారులు కొన్ని కారణాలు చెబుతున్నారు. అధికారులు సర్వే నిర్వహించిన సాగుయోగ్యమైన భూముల వివరాలను రీ సర్వే సెటిల్మెంట్ రిజిస్టార్ (ఆర్ఎస్ఆర్)లో నమోదు చేశారు. అందులో విస్తీర్ణం తక్కువ ఉండి, పట్టాదారు పాస్ పుస్తకంలో ఎక్కువున్న వారికి సాయం జమ కావడం లేదని తెలుస్తున్నది. కొంత భూమికి ఇచ్చి మరి కొంత భూమికి ఇవ్వడం లేదు.
ఒక సర్వే నంబర్లో ఉన్న భూ విస్తీర్ణం కన్నా పట్టాదారు పాసు పుస్తకాల్లో ఎక్కువ విస్తీర్ణం ఉన్నా ఆయా సర్వే నంబర్లలో ఏ ఒక్కరికీ అందడం లేదు. క్రాప్ బుకింగ్ పోర్టల్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. సాగు యోగ్యమైన భూమి అయినప్పటికీ రెండు మూడు సీజన్లలో పంటలు సాగు చేయడం లేదని క్రాప్ బుకింగ్ సర్వేలో తేలిన భూములకు కూడా ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడం లేదు. ఇలాంటి రైతులు వేల సంఖ్యలోనే ఉన్నట్లు అధికారుల గణాంకాలను బట్టి తెలుస్తున్నది. 16 వేల పైచిలుకు రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. నిజానికి వ్యవసాయ అధికారులు తేల్చిన సాగు యోగ్యంకాని భూములు 5,476 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తున్నది. కానీ, ఈ రకమైన కారణాలు చూపుతూ వేలాది మంది భూములకు రైతు భరోసా వర్తింపజేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు కింద ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సాగు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది. కానీ, ఎన్ని ఎకరాల వరకు ఇస్తామనేది మాత్రం ఇంత వరకు చెప్పలేదు. ఇప్పటి వరకు కేవలం మూడు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చినా.. మిగతా రైతులకు ఇస్తుందా.. లేదా..? అనే విషయంలో ఎక్కడా స్పష్టత ఇవ్వడం లేదు. ఈ విషయమై రైతులు ప్రశ్నిస్తుంటే అధికారులు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి ఉన్నది.
గతంలో గుంట భూమి నుంచి మొదలుకుంటే ఎకరం వరకు, ఆ తర్వాత రెండెకరాలు, మూడెకరాలు ఇలా విడుతల వారీగా వారం వ్యవధిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు జమ చేసింది. కానీ, ఇప్పుడు ఏ రైతుకు వస్తుంది? ఎంత భూమి ఉంటే వస్తుంది? ప్రామాణికం ఏమిటనే విషయంలో స్పష్టత లేక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నిజానికి అధికారులు ట్రెజరీకి పంపిన రైతులందరికీ రైతు భరోసా వస్తుందనే గ్యారంటీ లేకుండా పోయింది. ఇప్పటికే 42,964 మందికి సంబంధించిన రైతు భరోసా ట్రెజరీలో పెండింగ్‌లో ఉంది. అయితే, అందులో మూడెకరాలకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు ఎంత మంది ఉన్నారు? ఆ లోపు భూమి ఉన్న రైతులు ఎంత మంది ఉన్నారు? అనే విషయంలో స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో రైతు భరోసా విషయంలో రైతులు తీవ్రమైన గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.