Vemulawada | వేములవాడ, మార్చి 8: ప్రజలకు పరిపాలనపరమైన మండల స్థాయి అధికారి అయి ఉండి ఏదైనా సమస్య ఉండి ఫోన్ చేస్తే ఫోన్ ఆయన ఎత్తరు. సరే పని మీద కార్యాలయం కు వస్తే ఫోన్ తో లోపటికి రానివ్వరు. ఇది సామాన్య ప్రజలకు కాదు ఏకంగా సర్పంచ్ నాయకులకే చుక్కలు చూపిస్తున్న వేములవాడలోని తహసీల్దార్ తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
వేములవాడ మండలంలోని 17 గ్రామాల పరిధిలోని ప్రజలకు ప్రజా పాలన అందించాల్సిన అధికారి వ్యవహరిస్తున్న తీరు పట్ల గ్రామ ప్రథమ పౌరులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఏదైనా పనిమీద కార్యాలయానికి వెళ్లిన మీరు చాలా ఎక్కువగా చేస్తున్నారు కేసులు పెడతామంటూ బెదిరింపులకు కూడా దిగుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
ఇక వేములవాడ రూరల్ మండలంలోని హనుమాజీపేట గ్రామ పరిధిలో మంచినీటి బావుల సమీపంలో ఇసుక తీయొద్దని తమకు వచ్చే వేసవికాలంలో నీటి ఎద్దడి వచ్చే ప్రమాదం ఉంటుందని పంచాయతీ పాలకవర్గం కార్యాలయంకు చేరుకొని ఇటీవలే సదరు అధికారికి వినతి పత్రం అందజేశారు. అయితే పాలకవర్గంతో పాటు గ్రామ సర్పంచ్ సైతం ఫోన్ లను ఆయన లోనికి అనుమతి ఇవ్వకుండా ముందుగా వెంట తెచ్చిన మొబైల్ ఫోన్లను అటెండర్ కి ఇవ్వాలని హుకుం జారీ చేశాడనే విమర్శలు సైతం లేకపోలేదు. సర్పంచ్ ఫోన్ సైతం తీసుకోమ్మని ఆర్డర్ కూడా వేశాడంటే ఆ అధికారి తీరుపై ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు.
సరే సమస్య మీద వచ్చాం కదా అని వారు తమ సమస్యను వెల్లడించి వెళ్లిపోయారు. కానీ అధికారి వ్యవహరించిన తీరును వారు తీవ్రంగా తప్పుపట్టారు. ఇక మల్లారం గ్రామ సర్పంచ్ తాలూకాకు చెందిన ఒకరిని కూడా ఉద్దేశించి కించపరిచే మాటలు మాట్లాడినట్లు తెలియడంతో అతను నేరుగా కార్యాలయంకు చేరుకొని అధికారిని ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నారని అడిగారని తెలిసింది. దీంతో శివమెత్తిన అధికారి సదర్ నాయకుని పట్ల నానా దుర్భాషలాడినట్లు సమాచారం. తనేమి తక్కువ కాదన్నట్టు సదర్ నాయకుడు కూడా అందిన కాడికి దండకం చదివించినట్లు కార్యాలయం వర్గాల ద్వారా తెలిసింది.
ఇది కార్యాలయ పనివేళలోనే సుమారు అరగంటకు పైగా జరిగిన వ్యవహారం తీరుపై పనులపై వచ్చిన కార్యాలయానికి ప్రజలు సైతం అధికారి తీరిపై ముక్కున వేలు వేసుకున్నట్లు తెలిసింది. ఇక మరో గ్రామ సర్పంచ్ వ్యవహారంలోనూ ఇలానే తాను ఒంటెద్దు పోకడతో వ్యవహరించినట్లు తెలిసింది. ఏది ఏమైనా ప్రజా ప్రతినిధుల పట్ల కనీస మర్యాద పాటించి సమస్యలను పరిష్కరించాల్సిన మండల స్థాయి అధికారి వ్యవహారం తీరు ప్రస్తుతం సర్పంచులకు విసుగెత్తి పోయింది. ఈ అధికారి తీరుపై మండలంలోని పది మంది పైగా సర్పంచులు కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.