సర్కార్ భూములను కాపాడాల్సిన సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. చర్యలు తీసుకునేవారు కరువయ్యారని స్థానికులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. నిత్యం అటుగా వెళ్లే అధికారుల కూడా పట్టించుకోవడం లేదు
మునిపల్లి, ఆగస్టు 19 : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరా చౌరస్తాలోని భూముల ధరలు రూ. కోట్లల్లో పలుకుతున్నాయి. కొన్నేండ్ల క్రితం మునిపల్లి మండలంలోని బుధేరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి సర్వే నెంబర్ 90లోని సర్కార్ భూమి ప్రభుత్వం ఎకరం ఇచ్చింది. ఇంత వరకు అంతా బాగానే ఉంది. ముంబయి జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న భూములకు ధరలు అధికమయ్యాయి. దీంతో సర్కారు భూమి ఉన్న పట్టాదారు అందిన కాడికి ఇష్టం వచ్చిన రీతిలో అమ్మడం స్టాట్ చేస్తున్నాడు. ప్రభుత్వ భూమిలో కొంతమంది అక్రమార్కులు ఇండ్లు నిర్మాణం చేసుకొని అద్దెకు ఇస్తూ వ్యాపారాలు మొదలు పెట్టారు. బుధేరా చౌరస్తాలోని ప్రభుత్వ భూమి పక్కన ఉన్న పట్టాభూమిలో కొంత భూమి కొనుగోలు చేసుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి బుధేరాచౌరస్తాలో ఫంక్షన్‌హాల్ నిర్మాణం చేపట్టాడు. ఫంక్షన్‌హాల్ ముందు ఉన్న ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే సీసీ రోడ్డు నిర్మించారు.
వ్యాపారుల ఇష్టారాజ్యమా ? : మునిపల్లి మండలం బుధేరా చౌరస్తాలో కొంతమంది వ్యాపారులు సర్కారు భూముల్లో ఇష్టానుసారంగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిత్యం అటుగా వెళ్లే అధికారులకు సర్కారు భూములు కనిపించడం లేదా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబయి జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న భూములకు ధరలు రూ. కోట్లు పలకడంతో సర్కారు భూములు సైతం కబ్జాలకు గురవుతున్నాయి. సర్కారు భూములు కబ్జా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. సర్కారు భూముల్లో బిల్డింగ్లు, సీసీ రోడ్లు నిర్మించినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరా చౌరస్తాలోని 90 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలో చేపట్టిన సీసీ రోడ్డుతో పాటు పలు కట్టడాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. సర్కారు భూముల్లో ఎవరైనా అక్రమ కట్టడాలు చేపడితే వదిలిపెట్ట్టం. ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా సర్కారు భూములు అందించింది.. కానీ కొంతమంది లబ్ధిదారులు లీజు పేరుతో అమ్ముకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. లీజుకు ఇచ్చి డబ్బులు తీసుకున్న వారి భూములపై పైఅధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. తప్పుడు సర్వే నంబర్లు వేసి సర్కారు భూములు రిజిస్ట్రేషన్లు చేసుకొని అక్రమ నిర్మాణాలు చేసిన వారి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు అందజేస్తాం. సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠినచర్యలు తీసుకుంటాం.
-రంగరావు,మునిపల్లి తహసీల్దార్ (సంగారెడ్డి జిల్లా)